అదుపు తప్పుతున్న ‘ఆదర్శ’ కలం

మాటల మాంత్రికుడు, గురూజీ, సరస్వతి రూపం ఇలా ఎన్ని బిరుదులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అలంకారంగా ఉంటూ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రాసలతో మేజిక్ చేసే ఒక ట్రెండ్ ని సృష్టించి వినోదాన్ని, జీవిత సారాన్ని ఒకేసమయంలో చెప్పగలిగిన నేర్పు ఇప్పటి రచయితల్లో ఆయనకు మాత్రమే సొంతమైన శైలి. అలాంటి కలం ఇప్పుడు అదుపు తప్పుతోందా అంటే ఔననే సమాధానమే ఎక్కువ వినిపిస్తోంది. ఆదర్శ కుటుంబం ఏకే 47 మీద జరుగుతున్న డిబేట్ కన్నా సాక్ష్యం అక్కర్లేదు.

ఇదే వెంకటేష్ కి నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి రూపంలో ఎప్పటికీ మర్చిపోలేని డైలాగులు రాసిన త్రివిక్రమ్ మొదటిసారి ఆయన్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఏ రేంజ్ అవుట్ ఫుట్ ఇస్తారోనని ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకోవడం తప్పేం కాదు. వాయిదాలు, రీ షూట్లు, ఆలస్యాలు ఇలా రకరకాల కారణాలు ఎన్నయినా ఉండొచ్చు, కానీ అన్ని వర్గాల ప్రేక్షకులు ఇన్ని ఆశలు పెట్టుకున్నప్పుడు వాటిని నిలబెట్టుకునేలా శాయశక్తులా ప్రయత్నించడం కూడా చాలా అవసరం. 75 కోట్లు వచ్చాయని నిర్మాణ సంస్థ వేసుకున్నా క్షేత్ర స్థాయిలో అంత ఊపు లేదన్నది వాస్తవం.

వీకెండ్ కాకుండానే ఆదర్శ కుటుంబం ఇంత డ్రాప్ చూపించడం థియేటర్ ఆక్యుపెన్సీల సాక్షిగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ నుంచి ఒకప్పటి మేజిక్ టచ్ ని మూవీ లవర్స్ ఆశిస్తున్నారు. ఆ స్టైల్ మళ్ళీ తీసుకొస్తే నెత్తిన బెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతే తప్ప జల్సాలో బ్రహ్మానందం టవల్ జారిపోయే సీన్ ని మళ్ళీ సత్య మీద ప్లే చేయడం లాంటివి కాదు. నివేత పేతురాజ్ వెంకీ మీద మనసు పారేసుకోవడం లాంటి అవుట్ డేటెడ్ సన్నివేశాలు కాదు. ఇదంతా ఇప్పుడు వర్కౌట్ కాని సరుకు.

బ్లాస్ట్ జోన్ తో పోలికలు వస్తున్నాయని మార్చుకున్నారో లేక ఒరిజినల్ స్క్రిప్ట్ ఇలా ఉందో తెలియదు కానీ ఆదర్శ కుటుంబం రైటింగ్ మటుకు చాలా కన్వీనియంట్ గా రాసుకున్న వైనం ముఖ్యంగా సెకండాఫ్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. లాజిక్స్ లేకుండా చూసేందుకు ఇదేం ఫాంటసీ మూవీ కాదు. బేసిక్స్ అయితే ఫాలో కావాల్సిందే. అవి కూడా మిస్ అయ్యాయి. అయినా కూడా వసూళ్లు వస్తున్నాయంటే దానికి కారణం వెంకటేష్ ఇమేజ్, త్రివిక్రమ్ బ్రాండ్. ఈ ఇద్దరికీ తగ్గ సాలిడ్ సబ్జెక్టు పడి ఉంటే రికార్డులు బద్దలయ్యేవి.