హీరోయిన్లకు నవంబర్ పరీక్ష.. సోలోగా నిలబడతారా?

స్టార్ హీరోలతో కలిసి నటించినప్పుడు హీరోయిన్లకు వచ్చే క్రేజ్ వేరు. అదే సొంతంగా సినిమాను నడిపించాల్సి వస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. ముఖ్యంగా భారీ ఓపెనింగ్స్ రాబట్టడం అంత సులభం కాదు. ఈ నవంబర్‌లో ఇద్దరు పాపులర్ హీరోయిన్లు అలాంటి ప్రయత్నాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒకరు నయనతార కాగా, మరొకరు రష్మిక మందన్న. ఇద్దరికీ మంచి గుర్తింపు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

నయనతార నటించిన ‘మహాశక్తి’ నవంబర్ 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గతంలో పలు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. అయితే తమిళంలో ఆమెకున్న మార్కెట్, తెలుగులో సోలో సినిమాలకు వచ్చే ఆదరణ ఒకేలా ఉండవు. ఈసారి తెలుగు ఆడియన్స్‌ను ఎంతవరకు థియేటర్లకు రప్పిస్తారనేది చూడాలి.

మరోవైపు రష్మిక ‘మైసా’ నవంబర్ 27న విడుదలకు షెడ్యూల్ అయింది. ఇందులో గోండు గిరిజన మహిళగా రష్మిక యాక్షన్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న ఆమెకు ఇది భిన్నమైన ఛాలెంజ్. పైగా ఐదు భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రకటించిన తేదీ ప్రకారం సినిమా వస్తుందా అనే విషయంలో ఇంకా కొంత కన్ఫ్యూజన్ ఉంది.

ఇక్కడ ఇద్దరి మధ్య మరో తేడా ఉంది. నయనతార ఇప్పటికే సోలో సినిమాలతో తన మార్కెట్‌ను పరీక్షించుకుంది. రష్మికకు మాత్రం ఇప్పుడు ఉన్న పాన్ ఇండియా గుర్తింపును సొంత సినిమాకు ఉపయోగించుకునే అవకాశం వచ్చింది. స్టార్ హీరోలతో అందుకున్న విజయాలు, హీరోయిన్ ప్రధాన పాత్రలో వచ్చే వసూళ్లు ఒకేలా ఉండవు. ముఖ్యంగా నవంబర్‌లో పెద్ద సినిమాల పోటీ కూడా ఉంది. ‘మైసా’ ప్రకటించిన తేదీకే ‘హైందవ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ల పేరుతో వచ్చే సినిమాలకు ఓపెనింగ్స్ ఎంతవరకు ఉంటాయనేది కీలకం.