టాలీవుడ్లో ఇమేజ్, ఫ్యాన్స్ అని లెక్కలు వేసుకోకుండా.. కలెక్షన్లు, రికార్డుల గురించి అస్సలు పట్టించుకోకుండా సినిమాలు చేసే హీరో విక్టరీ వెంకటేష్. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఆయన.. తర్వాతి తరం హీరోల హవా మొదలయ్యాక మిగతా సీనియర్ హీరోల్లాగే రేసులో వెనుకబడ్డారు. అలా తనేంటో ప్రూవ్ చేసుకోవాలని ఆయన ప్రయత్నించలేదు. హీరోయిజం లేని పాత్రలు చేశారు. వేరే హీరోలతో కలిసి మల్టీస్టారర్లు కూడా చేశారు.
సోలో హీరోగా ఆయన సినిమాల కలెక్షన్లు ఒక రేంజికి మించి వెళ్లకపోవడంతో ఇక మళ్లీ విక్టరీ హీరో మునుపటి వైభవం చూడడం కష్టమే అనుకున్నారంతా. కానీ అనిల్ రావిపూడితో జట్టు కట్టాక మాత్రం ఆయన సినిమాల లెవెల్ మారిపోయింది. 2019 సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్-2’ ఎవ్వరూ ఊహించని బ్లాక్ బస్టర్ అయింది. అంతకుముందు వెంకీ సినిమాలకు పాతిక కోట్ల షేర్ కూడా కష్టం అన్నట్లుండేది. కానీ ఈ చిత్రం ఏకంగా 80 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది.
తర్వాత అనిల్‌తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం అయితే.. ఏకంగా రూ.130 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇది కూడా సంక్రాంతి సినిమానే. కానీ అనిల్ రావిపూడి, సంక్రాంతి లేకుండా వెంకీ బాక్సాఫీస్ వేటకు వచ్చినపుడల్లా ఆయనకు ఆశించిన ఫలితాలు రావట్లేదు. కలెక్షన్ల విషయంలో చాలా పెద్ద గ్యాప్ ఉంటోంది. గత కొన్నేళ్లలో వెంకీ నుంచి వచ్చిన థియేట్రికల్ రిలీజ్‌లలో ‘వెంకీ మామ’ బిలో యావరేజ్‌గా నిలిచింది. ‘సైంధవ్’ డిజాస్టర్ అయింది.
‘మన శంకర వరప్రసాద్ గారు’లో చేసింది క్యామియో కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోలేం. ఒకవేళ కౌంట్లోకి తీసుకున్నా, అది కూడా అనిల్ సినిమానే, సంక్రాంతికే రిలీజైంది. ఇప్పుడు త్రివిక్రమ్ లాంటి పెద్ద దర్శకుడితో వెంకీ సినిమా చేస్తే.. వీకెండ్ షేర్ రూ.25 కోట్లకు మించలేదు. ఓవరాల్ షేర్ రూ.50 కోట్ల మార్కును టచ్ చేయడం కూడా చాలా కష్టంగానే కనిపిస్తోంది. దీంతో రావిపూడి, సంక్రాంతి లేకపోతే వెంకీ ఇంత వీకా అనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో.
Gulte Telugu Telugu Political and Movie News Updates