చరణ్, సుకుమార్ సినిమా… సిల్లీ డిస్కషన్లు

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రిపీట్ కాంబో ఎట్టకేలకు రంగంలోకి దిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు సుకుమార్ కలయికలో కొత్త సినిమాకు నిన్ననే భారీ ఎత్తున ముహూర్త వేడుక జరిపారు. ఈ సందర్భంగా టీం ఒక కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. కానీ అది చూసి జనాలు ఏదో ఊహించేసుకుంటున్నారు. ఈ సినిమా రీమేక్ అని ప్రచారం చేసేస్తున్నారు.

ఆ సినిమా పేరు వింటే షాకవ్వక మానరు. ఈ ఏడాది పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన గుజరాతీ మూవీ ‘లాలో’ ఆధారంగా చరణ్, సుకుమార్ సినిమా తెరకెక్కనుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం కాన్సెప్ట్ పోస్టరే. అందులో నెమలీకలోంచి రామ్ చరణ్ రూపాన్ని చూపించారు. నెమలీక ఉంది కాబట్టి అది కృష్టుడి మీద తీస్తున్న సినిమా అని, ‘లాలో’కు ఇది రీమేక్ అని ప్రచారం చేసేస్తున్నారు.

‘లాలో’ను రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేయబోతున్నారని కొన్ని రోజుల కిందటే ఒక చర్చ జరిగింది. ఇప్పుడు సుకుమార్ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ చూశాక, దానికి దీనికి లింకు పెట్టేసి కథలు అల్లేస్తున్నారు. కానీ ‘లాలో’ సినిమా రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్‌కు ఏమాత్రం సూటయ్యేది కాదు. సుకుమార్ శైలికి కూడా అది అస్సలు నప్పదు. అలాంటి డివోషనల్, స్పిరిచువల్ టచ్ ఉన్న కథను చరణ్, సుక్కు కాంబోలో ఎలా ఊహించుకుంటాం?

అయినా సుకుమార్ రెండేళ్ల పాటు కష్టపడి స్క్రిప్టు తయారు చేసింది రీమేక్ చేయడం కోసమా? ఇప్పటిదాకా ఆయన ఎప్పుడైనా రీమేక్ చేశారా? వాటిమీద ఆయనకు ఆసక్తి ఉందా? ఒకవేళ రీమేక్ చేసినా.. ఇలాంటి సినిమాను చేస్తారా? ఇవేవీ ఆలోచించట్లేదు జనాలు. పోస్టర్ చూశారు.. ‘లాలో’ రీమేక్ అని తీర్మానించేశారు. వాస్తవం ఏంటంటే.. సుకుమార్ ఈసారి కూడా తనదైన ఒరిజినల్ స్క్రిప్టుతోనే వస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో నడిచే ఒక రా అండ్ రస్టిక్ మూవీ ఇది. త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు కానీ ఈ సిల్లీ డిస్కషన్లు ఆగవు.