వీర‌భ‌ద్రుడికి లైన్ క్లియ‌ర్… మ‌రి జ‌న‌నాయ‌కుడు?

త‌మిళ రాజ‌కీయాల్లో గ‌త కొన్ని రోజులుగా న‌డుస్తున్న రాజ‌కీయ సందిగ్ధ‌త‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డింది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తును టీవీకే అధినేత విజ‌య్ సంపాదించ‌డం.. గ‌వ‌ర్న‌ర్ కూడా ఈ విష‌యంలో క‌న్విన్స్ కావ‌డంతో ఆదివారం కొత్త స‌ర్కారు కొలువుదీరింది. విజ‌య్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. తొలి ద‌శ క్యాబినెట్‌ను కూడా ప్ర‌క‌టించారు. దీంతో త‌మిళ‌ సినీ ప‌రిశ్ర‌మ కూడా ఊపిరి పీల్చుకుంది.

ఎన్నిక‌లు, ఫ‌లితాలు ఆ త‌ర్వాత న‌డిచిన డ్రామా వ‌ల్ల జ‌నం దృష్టి సినిమాల పైకి వెళ్ల‌లేదు. ముందు వారం వచ్చిన ధనుష్ సినిమా ఈ హ‌డావుడిలో కొట్టుకుపోయింది. ఈ వారం చెప్పుకోద‌గ్గ రిలీజ్‌లే లేవు అక్క‌డ‌. ఇక వ‌చ్చే వారాంతంలో రావాల్సిన సూర్య సినిమా క‌రుప్పు చెప్పిన డేట్‌కు వ‌స్తుందో రాదో అన్న అయోమ‌యం నెల‌కొంది. ఈ మూవీ ట్రైల‌ర్ లాంచ్‌ను కూడా వాయిదా వేయ‌డంతో సినిమాను కూడా పోస్ట్ పోన్ చేయొచ్చ‌నే ప్ర‌చారం జ‌రిగింది.

కానీ సీఎంగా విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం పూర్తి కావ‌డంతో క‌రుప్పు విడుద‌ల‌కు లైన్ క్లియ‌రైంది. ఈ సినిమా 14నే విడుద‌ల కాబోతోంద‌ని ద‌ర్శ‌కుడు ఆర్జే బాలాజీ ఎక్స్ వేదికగా ప్ర‌క‌టించాడు. ఈ రోజే ట్రైలర్ లాంచ్ అవుతుంద‌ని, దాంతో పాటే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొద‌లుపెడ‌తామ‌ని అతను వెల్ల‌డించాడు. చెప్పిన ప్ర‌కార‌మే రాత్రి 8 గంట‌ల‌కు ట్రైల‌ర్ వ‌చ్చింది.

ఈ చిత్రాన్ని తెలుగులో వీర‌భ‌ద్రుడు పేరుతో రిలీజ్ చేయ‌నున్నారు. తెలుగు ట్రైల‌ర్ కూడా త్వ‌ర‌లోనే రాబోతోంది. హైద‌రాబాద్‌లో ఒక ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టే అవ‌కాశ‌ముంది. సూర్య సినిమాకు లైన్ క్లియ‌ర్ కాగా.. ఇక సీఎం విజయ్ చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ సంగ‌తేంట‌న్న‌దే తేలాల్సి ఉంది.

విజ‌య్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి వ‌చ్చిన ఆ చిత్ర నిర్మాత కె.నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ.. సెన్సార్ బోర్డుతో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని, ఇంకో రెండు వారాల్లో సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌క‌టించారు. క‌రుప్పు కూడా పెద్ద సినిమానే కావ‌డంతో అక్క‌డ్నుంచి రెండు వారాల గ్యాప్‌లో, అంటే ఈ నెల చివ‌ర్లో జ‌న‌నాయ‌గ‌న్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌మున్న‌ట్లే.