ఫిలిం ఇండస్ట్రీలో ఒక కథ వేర్వేరు చోట్లకు ప్రయాణించి.. చివరగా ఒక హీరో దగ్గర ఓకే అయి పట్టాలెక్కడం చాలా సినిమాల విషయంలో జరిగింది. ఇప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఐతే ఒక హీరో వదులుకున్న సినిమా చాలా పెద్ద హిట్టయితే కచ్చితంగా బాధ ఉంటుంది. అక్కినేని కుటుంబ కథానాయకుడు సుమంత్ కూడా ఇలా రెండు కథలు వదులుకున్నాడట. ఆ రెంటిలో ఒక సినిమా విషయంలో ఇప్పటికీ బాధ ఉందని, కానీ ఇంకో చిత్రం విషయంలో ఎలాంటి రిగ్రెట్స్ లేవని అంటున్నాడు సుమంత్.
తరుణ్ హీరోగా పరిచయం అయిన ‘నువ్వే కావాలి’ సినిమాను తనే చేయాల్సిందని సుమంత్ తెలిపాడు. ఐతే ఆ టైంలో ఒకేసారి యువకుడు, పెళ్ళిసంబంధం సినిమాలు చేస్తుండడంతో డేట్లు సర్దుబాటు చేయలేక ‘నువ్వే కావాలి’ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని సుమంత్ తెలిపాడు.
ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధ పడుతుంటానని చెప్పాడు. ‘నువ్వే కావాలి’ సినిమా అప్పట్లో మామూలు సంచలనం కాదు. తెలుగు ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద విజయం సాధించిన లవ్ స్టోరీ అదే అంటే అతిశయోక్తి కాదు.
ఇక సుమంత్ వదులుకున్న మరో చిత్రం.. దేశముదురు అట. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఐతే ముందు ఈ కథను పూరి తనకే చెప్పాడని, కొన్ని కారణాల వల్ల ఆ మూవీ చేయలేకపోయానని సుమంత్ తెలిపాడు. కానీ ఈ సినిమా తాను చేస్తే అంత పెద్ద హిట్టయ్యేది కాదని అతను నిర్మొహమాటంగా చెప్పడం విశేషం. అల్లు అర్జున్‌కే అది కరెక్ట్ అని, అతను చేయడం వల్లే అంత పెద్ద హిట్టయిందని అన్నాడు. కొంచెం సాత్వికంగా ఉండే పాత్రలే చేసే సుమంత్.. ‘దేశముదురు’ సినిమాకు సెట్ అయ్యేవాడు కాదని ఎవ్వరైనా ఒప్పుకుంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
