పెద్ది బోణీ… మొదటి బంతినే బాదేశాడు

ఇంకో ఇరవై ఆరు రోజుల్లో పెద్ది థియేటర్లలో అడుగు పెట్టనున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సిఎం పదవి గురించి సోషల్ మీడియాలో వేడి వేడి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ది గురించి సౌండ్ కొంచెం తక్కువగానే ఉంది. కొంచెం అది సద్దుమణగగానే రామ్ చరణ్ అభిమానులు రంగంలోకి దిగబోతున్నారు. నిర్మాణ సంస్థ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. సిచువేషన్ నార్మల్ అయ్యాక పబ్లిసిటీ వేగం పెంచాలని చూస్తున్నారు.

ఓవర్సీస్ లో మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ లోనే పెద్ది రికార్డుల పరంపర మొదలైపోయింది. వేగంగా 1 లక్ష డాలర్ మార్కు అందుకున్న తొలి ఇండియన్ మూవీగా ఘనత సాధించింది. దీనికి పట్టిన సమయం కేవలం నాలుగు గంటలు. ఇంతకు ముందు ఓజి, దేవర పేరు మీద ఉన్న మైలురాయిని సులభంగా దాటేసింది. దీన్ని బట్టే ఎన్ఆర్ఐ ప్రేక్షకుల్లో పెద్ది మీద ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇంకా ప్రారంభమే కాబట్టి రాబోయే రోజుల్లో నెంబర్లు భారీగా ఉంటాయి.

బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఎడిట్ వెర్షన్ రెడీ అయిపోయింది. సిజి, రెహమాన్ రీ రికార్డింగ్ అయిపోయాక నిడివి ఎంత ఉండాలనేది నిర్ణయించబోతున్నారు. ఇలాంటి స్టార్ హీరోల సినిమాలకు మూడు గంటల లెన్త్ ఉండటం సహజమే కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే వడబోత తప్పకపోవచ్చు. అయితే పుష్ప 2 తరహాలో రాజీ పడకుండా ఫైనల్ చేయాలనే ఉద్దేశంలో బుచ్చిబాబు ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్.

ఇంకా ట్రైలర్ రావాలి. ఈ నెల పదహారు లేదా పదిహేడు తేదీల్లో ఈ లాంఛనం ప్లాన్ చేస్తున్నారు. జూన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రతిపాదన ఉంది. ఈలోగా అమెరికా వెళ్లి రావాలా లేక రిలీజయ్యాక ప్రచారం చేయాలా అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. టైం చాలా తక్కువగా ఉండటంతో టీమ్ ఉరుకులు పరుగులు మీద ఉంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. జూన్ 3 ఇండియా వైడ్ భారీ ఎత్తున స్పెషల్ షోలు వేయబోతున్నట్టు సమాచారం.