రెండు హిట్లిచ్చి మాయ‌మైపోయిన హీరో

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవ‌ర్ నైట్ సెన్సేష‌న్ అయిపోయాడు యువ క‌థానాయ‌కుడు కార్తికేయ గుమ్మ‌కొండ‌. అప్ప‌టికే ప్రేమ‌తో మీ కార్తీక్ అనే ఒక సినిమా చేసినా.. దాని గురించి ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. ఆర్ఎక్స్ 100 త‌ర్వాత కార్తికేయ‌కు అవ‌కాశాలు వెల్లువెత్తాయి. వ‌రుస‌బెట్టి సినిమాలు చేశాడు కానీ.. మ‌ళ్లీ ఆర్ఎక్స్ 100 రేంజ్ స‌క్సెస్ ఒక్క‌టీ ప‌డ‌లేదు. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ‌లో చేసిన చావు క‌బురు చ‌ల్లగా సైతం అత‌డికి తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది.

నేచుర‌ల్ స్టార్ నాని సినిమా గ్యాంగ్ లీడ‌ర్‌లో, త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు అజిత్ మూవీలో విల‌న్ పాత్ర‌లు చేస్తే ఆ సినిమాలు కూడా స‌రిగా ఆడ‌లేదు. ఐతే ఇలా వ‌రుస‌గా ఫెయిల్యూర్లు వ‌స్తున్నా ఆప‌కుండా సినిమాలు చేసిన కార్తికేయ‌.. వ‌రుస‌గా రెండు హిట్లు కొట్టాక అదృశ్యం అయిపోవ‌డ‌మే ఆశ్చ‌ర్యం. 2023లో అత‌ను న‌టించిన ఫాంట‌సీ కామెడీ ఫిలిం బెదురులంక 2012 బాగానే ఆడింది. ఆ త‌ర్వాత కార్తికేయ భ‌జే వాయు వేగం అనే యాక్ష‌ణ్ థ్రిల్ల‌ర్‌లో న‌టించాడు. అది కూడా బాగా ఆడింది. ఈ చిత్రాన్ని యువి క్రియేష‌న్స్ లాంటి పెద్ద సంస్థ ప్రొడ్యూస్ చేసింది.

ఇలా వ‌రుస‌గా రెండు విజ‌యాలు అందుకున్న హీరో ఫుల్ బిజీ అయిపోతాడు. కానీ కార్తికేయ మాత్రం భ‌జే వాయు వేగం రిలీజై రెండేళ్లు గ‌డుస్తున్నా కొత్త సినిమాను అనౌన్స్ చేయ‌లేదు. పోనీ వలిమై త‌ర్వాత త‌మిళంలో ఏమైనా బిజీ అయిపోయాడా అంటే అదేమీ లేదు. అక్క‌డ కూడా సినిమాలేవీ చేయ‌ట్లేదు. తెలుగులో అత‌ను ఎవ‌రైనా ద‌ర్వ‌కుడు, నిర్మాత‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు కూడా వార్త‌లు రావ‌ట్లేదు. రెండేళ్ల‌లో ఎక్క‌డా కార్తికేయ గురించి ఏ న్యూస్ లేదు. సోష‌ల్ మీడియాలో కూడా సౌండ్ చేయ‌ట్లేదు కార్తికేయ‌.

ఇలా ఒక న‌టుడి కెరీర్లో గ్యాప్ వ‌స్తే ప్రేక్ష‌కులు నెమ్మ‌దిగా మ‌రిచిపోతారు. కార్తికేయ విష‌యంలో అదే జ‌రుగుతోంది. ఇండ‌స్ట్రీ జ‌నాల చ‌ర్చ‌ల్లో అత‌డి పేరు వినిపించ‌ట్లేదు. ఈ సినిమా ఈవెంట్లోనూ కార్తికేయ క‌నిపించ‌డం లేదు. మ‌రి అత‌డికి ఏమైంది? ఎందుకు సినిమాల‌కు దూరంగా ఉన్నాడు.. ఏదైనా స్పెష‌ల్ ప్రాజెక్టు మీద సైలెంటుగా ఏమైనా ప‌ని చేస్తున్నాడా అన్న‌ది తెలియ‌డం లేదు. మ‌రి కార్తికేయ నుంచి ఏమైనా క్లారిటీ వ‌స్తుందేమో చూడాలి.