ప్రస్తుతం దేశంలోనే అత్యుత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. తొలి చిత్రం ‘ప్రేమం’తో మొదలుపెడితే ప్రతి సినిమాతోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఈ అమ్మాయి. పాత్రల ఎంపికలో చాలా సెలక్టివ్‌గా ఉంటూ తనదైన దారిలో సాగుతున్న సాయిపల్లవికి.. కమర్షియల్ సక్సెస్‌తో సంబంధం లేకుండా ప్రతి సినిమాతోనూ మంచి పేరు వస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఆమెను చూడ్డానికే థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
తమిళం, మలయాళ భాషల్లోనూ సాయిపల్లవికి మంచి ఫాలోయింగే ఉంది. ‘రామాయణం’ లాంటి భారీ చిత్రంలో నటిస్తుండడంతో హిందీలోనూ సాయిపల్లవికి ఇలాంటి ఫాలోయింగే వస్తుందని భావిస్తున్నారు. కానీ అంతకంటే ముందు ‘ఏక్ దిన్’ అనే చిన్న సినిమాతో సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
ఈ చిత్రంలో సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరో. ఆమిర్ స్వయంగా నిర్మిస్తూ.. ప్రమోషన్లు కూడా గట్టిగా చేసిన సినిమా ఇది. కానీ ఈ ప్రమోషన్లేవీ సినిమాకు కలిసి రావడం లేదు. ఈ రోజు రిలీజవుతున్న సినిమా.. టాక్‌తో సంబంధం లేకుండా డిజాస్టర్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
‘ఏక్ దిన్’కు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టినప్పటి నుంచి స్పందన ఘోరంగా ఉంటోంది. రిలీజ్ రోజు ఉదయానికి కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోటి మార్కును అందుకోలేదు. శనివారం సాయంత్రానికి బుకింగ్స్ రూ.70 లక్షల మేర ఉన్నాయి. ఈ రోజు జరిగే అడ్వాన్స్ బుకింగ్స్, వాకిన్స్ కలుపుకున్నా.. కోటి రూపాయల నెట్ వసూళ్లు రావడం గగనంగా ఉంది.
ఈ రోజుల్లో కొత్త సినిమాలకు ఓపెనింగ్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాక్ బాగుంటే సినిమా నెమ్మదిగా పుంజుకుంటుందిలే అని తాపీగా ఉండే పరిస్థితి లేదు. థాయ్ మూవీ ‘వన్ డే’కు అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అద్భుతమైన టాక్ వచ్చి, ఒక్కసారిగా బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు మారిపోతే చెప్పలేం కానీ.. ఇప్పుడు మాత్రం సిచువేషన్ చాలా బ్యాడ్‌గా ఉంది.
కనీసం సాయిపల్లవిని చూడడానికి కూడా తన అభిమానులు ఈ సినిమాకు వచ్చే సంకేతాలు కనిపించడం లేదు. మరి ఈ రోజు ఈ చిత్రానికి ఎలాంటి రివ్యూలు వస్తాయో.. వీకెండ్లో ఎంతమేర సినిమా పుంజుకుంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates