అకీరా కోసం అడివి శేష్ కథ?

సినీ రంగంలో కొందరికి కొందరితో చిత్రమైన బంధం మొదలవుతుంది. థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్టుగా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన అడివి శేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌లది అలాంటి బంధమే. ఇంకా సినీ రంగంలోకి అడుగు పెట్టని అకీరాతో శేష్‌కు కొన్నేళ్ల ముందు నుంచే మంచి అనుబంధం ఉంది. వీరి మధ్య స్నేహం ఎలా మొదలైందో ఏమో కానీ.. ఇద్దరూ తరచుగా కలిసి కనిపిస్తుంటారు.

శేష్ ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చాడంటే.. అకీరా గురించి ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అతనూ పవన్ తనయుడి గురించి ఆసక్తికర విశేషాలు పంచుకుంటూ ఉంటాడు. ఐతే అకీరా కోసం శేష్ ఒక కథ రాస్తున్నట్లు.. పవన్ కొడుకు అరంగేట్ర చిత్రం శేష్ పర్యవేక్షణలో తెరకెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ఇటీవల ఓ ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో శేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో దాని గురించి స్పందించాడు.

అకీరా కోసం తాను కథ రాస్తున్న విషయం నిజం కాదని శేష్ చెప్పాడు. అకీరాకు ఇప్పటికే బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, తన ఎంట్రీ కోసం మిగతా ఫ్యాన్స్ లాగే తాను కూడా ఎదురు చూస్తున్నానని, అతనెప్పుడు ఎంట్రీ ఇచ్చినా అదొక సెన్సేషన్ అవుతుందని శేష్ వ్యాఖ్యానించాడు.

అకీరా అంటే తనకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమని.. తామిద్దరం అప్పుడప్పుడూ కలుస్తుంటామని.. తమ ఇద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ ఉందని, తామిద్దరం లెఫ్డ్ హ్యాండర్స్ అని.. అందుకే తమ మధ్య మంచి సింక్ కుదిరిందని అనుకుంటున్నానని శేష్ చెప్పాడు. అకీరా ఆలోచనలు, తన పరిణతి చూస్తే ఎంతో సంతోషం కలుగుతుందని శేష్ చెప్పాడు.

అకీరాకు నటన కంటే ముందు సంగీతం మీద ఆసక్తి ఉంది. ప్రస్తుతం అతను విదేశాల్లోనే సంగీతంతో పాటు నటనలోనూ శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. కెరీర్‌ విషయంలో ఇటు తండ్రి పవన్, అటు తల్లి రేణు దేశాయ్ అతడి మీద ఎలాంటి ఒత్తిడి తేవట్లేదు. నిర్ణయం తనకే వదిలేశారు.

ఐతే పవన్ ఫ్యాన్స్ మాత్రం అకీరా తెరంగేట్రం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అతను ఎప్పుడు వచ్చినా మెగా అభిమానులు తనకు ఘనస్వాగతం పలుకుతారనడంలో సందేహం లేదు. సామాన్య ప్రేక్షకుల్లో కూడా అకీరా మీద ప్రత్యేక ఆసక్తి నెలకొంది.