చరణ్ అభిమానుల రియాక్షన్ ఏంటి

పెద్దిలో నెలల తరబడి జనాన్ని సస్పెన్స్ లో పెట్టిన విషయం ఐటెం సాంగ్ హీరోయిన్. దర్శకుడు బుచ్చిబాబు ఎవరిని తెస్తాడనే దాని గురించి ఎన్ని ఊహాగానాలు చెలరేగాయో చెప్పడం కష్టం. అక్కడికీ క్రేజ్ ఉన్న భామలను తీసుకొచ్చేందుకు దర్శకుడు బుచ్చిబాబు చాలా కష్టపడ్డాడు. మృణాల్ ఠాకూర్ ని గట్టిగానే ట్రై చేశారు. కానీ కుదరలేదు. అంతకు ముందు మరో ఇద్దరినీ అనుకున్నారు. ఒకపక్క షూటింగ్ చేస్తూనే రకరకాల ఆప్షన్లు పరిశీలించుకుంటూ వచ్చారు.

ఇప్పుడు ఫైనల్ గా శృతి హాసన్ దగ్గర ఆగిపోవడం ఒక రిలీఫ్ ఇచ్చింది. అయితే చరణ్ ఫ్యాన్స్ రియాక్షన్లు ఎలా ఉన్నాయని గమనిస్తే యునానిమస్ గా అయితే కనిపించడం లేదు. ఎందుకంటే మూడేళ్ళ క్రితం చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో ఆడి పాడిన శృతిని ఇప్పుడు చరణ్ పక్కన చూడటం అంతగా సింక్ అవుతుందాని వాళ్ళ అనుమానం. అయితే చరణ్, శృతి హాసన్ గతంలో ఎవడులో లీడ్ పెయిర్ గా స్క్రీన్ షేర్ చేసుకున్న విషయాన్ని మర్చిపోకూడదు.

అభిమానుల కామెంట్లలో ప్రధానంగా చూడాల్సింది ఒకటుంది. శృతి హాసన్ ఇప్పుడు సీనియర్ల లిస్టులో చేరిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ తదితరుల్లా మునుపటి వేగం చూపించడం లేదు. సలార్ పూర్తిగా ప్రభాస్ వన్ మ్యాన్ షో కాబట్టి ప్రశాంత్ నీల్ తనను తీసుకున్నాడు కానీ ఒకవేళ డ్యూయెట్లు గట్రా ఉండి ఉంటే ఆప్షన్ మార్చుకునేవారేమో. సరే ఇదంతా అనుకుని లాభం లేదు కానీ డాన్స్, పిక్చరైజేషన్ తో అదరగొట్టాల్సిన బాధ్యత బుచ్చిబాబు మీద ఉంది.

జూన్ 25 విడుదల తేదీ దాదాపుగా ఫిక్స్ అయినట్టే. త్వరలోనే ప్రకటన ఇవ్వబోతున్నారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు, పోస్టుపోన్లు లేకుండా పక్కాగా లాక్ చేసుకుని అనౌన్స్ మెంట్ చేస్తారని తెలిసింది. మార్చ్ 26, ఏప్రిల్ 30 రెండు చాలా మంచి డేట్లను వదిలేసుకున్న పెద్ది ఇప్పుడు మూడో తేదీని బాగా సెలెక్ట్ చేసుకుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో మాట మీద నిలబడాల్సిన సిచువేషన్ తెచ్చుకుంది. ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ ప్రశాంతంగా చేసుకోవచ్చు.