బాలయ్య దర్శకులకు అసలైన సవాల్

​నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. గోపీచంద్ మలినేని, కొరటాల శివ వంటి ఇద్దరు కమర్షియల్ దర్శకులు బాలయ్యను డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే గోపీచంద్ షూటింగ్ చక చకా జరుపుతుండగా జూన్ నుంచి ఈ రెండు సినిమాల చిత్రీకరణలు ఒకేసారి జరగబోతున్నాయి. కేవలం మూడు నెలల విరామంతో దసరా 2026, సంక్రాంతి 2027 సీజన్లను టార్గెట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ తక్కువ టైమ్ లో బాలయ్యను ఎంత కొత్తగా చూపిస్తారనేది మరో ఎత్తు.

​అసలు విషయం ఏంటంటే, ఒకే హీరో సినిమాలు అతి తక్కువ గ్యాప్ లో వస్తున్నప్పుడు ప్రేక్షకులు వెరైటీ కోరుకుంటారు. ముఖ్యంగా బాలయ్య లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నటుడు రెండు సినిమాల్లోనూ ఒకేలా కనిపిస్తే బోర్ కొట్టే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు భారమంతా దర్శకులపైనే పడింది. ఒకే సమయంలో షూటింగ్ జరుగుతోంది కాబట్టి, మేకోవర్ కోసం ఎక్కువ టైమ్ దొరకదు. ఈ పరిస్థితుల్లో గోపీచంద్ తన పక్కా మాస్ స్టైల్‌ను, కొరటాల తన సోషల్ మెసేజ్ డ్రామాను ఏ రకంగా డిజైన్ చేస్తారో చూడాలి.

​సాధారణంగా కమర్షియల్ సినిమాలు అంటే ఒకే రకమైన ఎలివేషన్లు, డైలాగులు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఇద్దరు దర్శకులు బాలయ్య బాడీ లాంగ్వేజ్, లుక్ విషయంలో స్పష్టమైన తేడా చూపించాల్సి ఉంటుంది. గోపీచంద్ మలినేని గతంలో ‘వీరసింహారెడ్డి’తో బాలయ్యలోని ఫ్యాక్షన్ యాంగిల్‌ను వాడేశారు. మరి ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం ఆయన ఏ రూట్ ఎంచుకున్నారో అన్నది ఆసక్తికరం. ఇటు కొరటాల శివ తన కథల్లో హీరోలను చాలా హుందాగా చూపిస్తుంటారు. బాలయ్య మాస్ ఇమేజ్ కి కొరటాల క్లాస్ టచ్ తోడైతే వచ్చే ఆ వైవిధ్యమే ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది.

​ఒకేసారి రెండు సెట్లపైకి వెళ్లడం వల్ల బాలయ్య మీద కూడా ఒత్తిడి ఉంటుంది. ఒక షెడ్యూల్‌లో ఒక రకమైన ఎనర్జీని చూపిస్తూ, మరుసటి రోజు మరో సినిమా సెట్‌లో వేరే తరహా నటనను ప్రదర్శించడం అనేది నటుడిగా ఆయనకు ఒక పెద్ద పరీక్షే. షూటింగ్ స్పాట్‌లో గెటప్స్ మార్చుకోవడం సులభమే కానీ, ఆ పాత్రల్లోని లోతును ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించడమే ఇక్కడ అసలైన టాస్క్. ఈ ఇద్దరు దర్శకులు గనుక బాలయ్యను రెండు వేర్వేరు కోణాల్లో హైలెట్ చేయగలిగితే, బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.