నందమూరి బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో ‘లారీ డ్రైవర్’ ఒకటి. బాలయ్యకు ఎన్నో బ్లాక్బస్టర్లు ఇచ్చిన బి.గోపాల్ ఈ చిత్రానికి దర్శకుడు. పరుచూరి సోదరులు దీనికి రచన చేశారు. ఈ చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సినిమా తెర వెనుక సంగతులను పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానెల్ ‘పరుచూరి పలుకులు’లో పంచుకున్నారు. అప్పట్లో బాలయ్యతో బి.గోపాల్ సినిమా చేయడానికి అంగీకారం కుదిరాక కథ కోసం తమనే అడిగారని.. కానీ తాము చెప్పిన నిప్పురవ్వ, వంశానికొక్కుడు కథలు గోపాల్‌కు నచ్చకపోవడంతో ఆంజనేయ పుష్పానంద్ చెప్పిన ‘లారీ డ్రైవర్’ను ఓకే చేశాడని.. దానికి తాము మాటలు రాశామని గోపాలకృష్ణ వెల్లడించారు.
ఐతే ఈ సినిమా పూర్తయ్యాక రష్ చూసిన తన అన్నయ్య వెంకటేశ్వరరావు.. అది రెండు వారాలకు మించి ఆడదని చెప్పారని, కానీ తాను మాత్రం బాలయ్య దానికి ముందు చేసిన సూపర్ హిట్ మూవీ ‘ముద్దుల మావయ్య’ కంటే ఒక రూపాయి ఎక్కువే తెస్తుందని ధీమా వ్యక్తం చేశానని గోపాలకృష్ణ వెల్లడించారు.
ఐతే సినిమా పూర్తయ్యాక చేసిన కొన్ని మార్పులు ఈ సినిమాకు చాలా బాగా పని చేశాయని గోపాలకృష్ణ తెలిపారు. ముందు శారద చేసిన కలెక్టర్ పాత్ర తాలూకు సన్నివేశాలు కామెడీగా ఉన్నాయని.. ఆమె నటన కూడా ‘నారీ నారీ నడుమ మురారి’ తరహాలో తమాషాగా సాగిందని.. ఐతే తాను రష్ చూసి ఆ సన్నివేశాలన్నింటినీ రీషూట్ చేయమని గోపాల్‌కు చెప్పామని.. దీంతో అతను శారద చేసిన కలెక్టర్ పాత్రకు సీరియస్‌నెస్ వచ్చేలా మళ్లీ చిత్రీకరించాడని గోపాలకృష్ణ వెల్లడించాడు.
ఇక సెన్సార్ అయ్యాక తాను మరోసారి ఫస్ట్ కాపీ చూడగా.. శారదను విలన్ కొట్టాక దసరా వచ్చిందయ్యా పాట ప్లేస్మెంట్ ఉందని.. ఐతే కలెక్టర్‌కు అవమానం జరిగాక ఆమెతో కలిసి హీరో హీరోయిన్లు ఇలా సెలబ్రేషన్ మోడ్‌లో ఉండటం ఏమాత్రం బాగుండదని చెప్పి.. ఈ పాట, దానికి ముందు వచ్చే సన్నివేశాల్ని ముందుకు తేవాలని తనకు అనిపించిందని.. ఈ విషయం గోపాల్‌కు చెబితే అతను అంగీకరించలేదని గోపాలకృష్ణ తెలిపారు.
ఒకటికి రెండుసార్లు చెప్పినా గోపాల్ వినిపించుకోలేదని.. ఆ సమయంలో అతడి అసిస్టెంట్ స్వర్ణ సుబ్బారావు (బాలయ్యతో విజయేంద్ర వర్మ తీశాడు) కల్పించుకుని డైరెక్టర్ గారిని ఎందుకు డిస్టర్బ్ చేస్తారని అన్నాడని.. ఎప్పుడూ పరుష పదజాలం వాడని తాను అతడిపై కోపంతో తిట్టానని.. తర్వాత గోపాల్ తన బాధను అర్థం చేసుకుని తాను కోరుకున్నట్లు సీన్ ఆర్డర్ మార్చాడని.. ఆ మార్పుల వల్లే సినిమా పకడ్బందీగా మారి.. అంచనాల్ని మించి ఆడి సూపర్ హిట్టయిందని గోపాలకృష్ణ చెప్పారు. ఐతే ఈ సినిమా అంత పెద్ద హిట్టవడంలో మేజర్ క్రెడిట్ మంచి కథ రాసిన పుష్పానంద్కు, లారీ డ్రైవర్ పాత్రను మాస్ మెచ్చేలా పండించిన బాలయ్యకు దక్కుతుందని పరుచూరి అన్నారు.