తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ ఫిమేల్ ఫోక్ సింగర్ మంగ్లీనే అనడంలో మరో మాట లేదు. చిన్న స్థాయిలో ప్రైవేట్ సాంగ్స్ చేసుకునే అమ్మాయి.. సినిమాల్లో భారీ పారితోషకంతో స్పెషల్ సాంగ్స్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రైవేట్ ఈవెంట్లకు హాజరవ్వాలన్నా.. హీరోయిన్ల రేంజిలో ఆమెకు భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. ఐతే ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన మంగ్లీ తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి వస్తుండడమే ఆశ్చర్యం కలిగించే విషయం.
గతంలో ఆమె చేసిన రాజకీయ వ్యాఖ్యలు.. తీసుకున్న పొలిటికల్ స్టాండ్ విమర్శలకు దారి తీశాయి. ఇక ఆ మధ్య ఆమె హోస్ట్ చేసిన ఒక పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారన్న ఆరోపణలు కలకలం రేపాయి. తాజాగా మంగ్లీ ఓ పెద్ద వివాదంలో చిక్కుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరిట మంగ్లీ, ఇంకో ఇద్దరు కలిసి రూ.10 కోట్లకు మోసం చేసినట్లుగా సుబ్బారావు అనే న్యాయవాది కేసు పెట్టడం కలకలం రేపుతోంది.
తన దగ్గర రూ.10 కోట్లు తీసుకుని మోసం చేసిందని.. డబ్బుల కోసం అడిగితే యాక్సిడెంట్ చేసి చంపుతానని.. శవం కూడా దొరకకుండా చేస్తానని మంగ్లీ బెదిరించిందని సుబ్బారావు హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరు చెప్పని తనతో పాటు దాదాపు 150 మందిని మంగ్లీ బృందం మోసం చేసిందని.. మంగ్లీ సోదరుడు శివ, ప్రముఖ దర్శక నిర్మాత వేణు ఉడుగుల కూడా ఈ కుట్రలో భాగమని బాధితుడు ఆరోపించాడు.
వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని సుబ్బారావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. బీఎన్ఎస్ 351 (2), 352 సెక్షన్ల కింద మంగ్లీ, వేణు ఉడుగుల, శివల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదంపై మంగ్లీ, వేణు ఇంకా ఏమీ స్పందించలేదు. దర్శకుడిగా ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘విరాటపర్వం’ లాంటి మంచి సినిమాలు తీసిన వేణు ఉడుగుల.. నిర్మాతగా మారి ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates