‘జననాయగన్’ నిర్మాత పరిస్థితేంటి?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ ఉండగా ఆయన్ని మించిన స్టార్ రాడని అంతా అనుకున్నారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, వసూళ్లు ఆ స్థాయిలో ఉండేవి. కానీ విజయ్ గత దశాబ్ద కాలంలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయి.. రజినీనే మించిపోయాడు. తమిళంలో నంబర్ వన్ హీరోగా ఎదిగాడు. అలాంటి హీరోతో తన చివరి సినిమాను ప్రొడ్యూస్ చేసే అవకాశం దక్కించుకున్న నిర్మాత నారాయణను చూసి ఎంతో లక్కీ అనుకున్నారు. కర్ణాటకకు చెందిన ఈ నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ బేనర్లో విజయ్ చివరి చిత్రం ‘జననాగయన్’ను ప్రొడ్యూస్ చేశాడు.

ఈ సినిమా ద్వారా ఆయన తక్కువలో తక్కువ రూ.100 కోట్ల లాభం అందుకుని ఉంటాడని అంచనా వేశారు. ఈ సినిమా అనుకున్న ప్రకారం జనవరి 9న రిలీజ్ అయి ఉంటే అంతకుమించే లాభం వచ్చేదేమో. కానీ సెన్సార్ సమస్యల కారణంగా ఆ చిత్రం అనూహ్యంగా వాయిదా పడిపోవడంతో నిర్మాత పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారింది.

వాయిదా వల్ల బయ్యర్లు వెనక్కి తగ్గారు. సమయానికి రావాల్సిన డబ్బులు రాలేదు. ఓటీటీ సంస్థ కూడా డీల్ క్యాన్సిల్ చేసింది. వడ్డీల భారం మీద పడి నిర్మాతకు రావాల్సిన లాభమంతా ఆవిరైపోయే పరిస్థితి తలెత్తింది.

ఇప్పటిదాకా జరిగిందంతా ఒకెత్తయితే.. ఇప్పుడు జరుగుతున్న నష్టం మరో ఎత్తు. సినిమా ఎప్పుడు రిలీజైతే అప్పుడు బాగానే డిమాండ్ ఉంటుందని.. పెట్టిన పెట్టుబడి అంతా వెనక్కి వచ్చేలా బిజినెస్ జరుగుతుందని ఆశిస్తూ వచ్చాడు నిర్మాత. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆన్ లైన్లో లీక్ అయిపోయింది. ముందు ఐదు నిమిషాల్ ఎపిసోడ్ మాత్రమే బయటికి వచ్చింది. తర్వాత చూస్తే మొత్తం లీక్ అయిపోయింది. పైరసీ వెబ్ సైట్ల ద్వారా పెద్ద ఎత్తున డౌన్ లోడ్స్ జరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. 

పైరసీ వెర్షన్స్ ఆన్ లైన్ నుంచి డెలీట్ చేయించేందుకు ఎంత గట్టి ప్రయత్నం జరుగుతున్నా సరే లాస్ పెద్దగానే ఉండబోతోంది. సినిమా బిజినెస్ మీద ఇది తీవ్ర ప్రభావమే చూపేలా ఉంది. ఇటు బయ్యర్లు, అటు ఓటీటీ, శాటిలైట్ ఛానెళ్లు ఇప్పుడు అనుకున్న దాని కంటే తక్కువకే సినిమాను అడుగుతారనడంలో సందేహం లేదు. దీని వల్ల నిర్మాతకు భారీ నష్టం తప్పేలా లేదు. మొత్తానికి విజయ్ చివరి చిత్రంతో జాక్ పాట్ కొట్టాడనుకున్న నిర్మాత.. ఇప్పుడు భారీ నష్టాల పాలయ్యేలా కనిపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో విజయ్ తన ప్రొడ్యూసర్‌ను ఎంతమేర ఆదుకుంటాడో చూడాలి.