ప్రస్తుతం టాలీవుడ్లో ప్రామిసింగ్ యంగ్ యాక్టర్లలో అడివి శేష్ ఒకడు. తనకంటూ హీరోగా ఒక స్థాయి ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ కూడా సంపాదంచుకున్నాడు. శేష్ హీరోగా నటిస్తున్న గూఢచారి-2 చిత్రం మీద ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ కూడా పెడుతున్నారు. శేష్ పెర్ఫామర్‌గానూ మంచి పేరే సంపాదించాడు. కానీ కెరీర్ ఆరంభంలో శేష్ చేసిన సినిమాలేవీ వర్కవుట్ కాలేదు.
స్వీయ దర్శకత్వంలో నటించిన కర్మ, కిస్ సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోలేదు. పంజా మూవీలో విలన్ పాత్ర చేసినప్పటి నుంచే అందరి దృష్టిలో పడ్డాడు శేష్. ఐతే అంతకంటే ముందు చందమామ లాంటి హిట్ మూవీలో శేష్‌కు అవకాశం దక్కిందట. అందులో నవదీప్ చేసిన కిషోర్ పాత్రకు మొదట ఎంపికైంది శేష్‌యేనట. కానీ తన నటన బాగా లేకపోవడంతో దర్శకుడు కృష్ణవంశీ ఆ సినిమా నుంచి తనను తప్పించినట్లు ఒక ఇంటర్వ్యూలో శేష్ వెల్లడించాడు.
కృష్ణవంశీ గారి చందమామ సినిమాలో నవదీప్ చేసిన పాత్రకు ఫస్ట్ ఛాయిస్ నేనే. ముందు ఆ సినిమాకు మల్లెపువ్వు అనే టైటిల్ పెట్టారు. కొన్ని రోజులు షూటింగ్ చేశాక నన్ను ఆ సినిమా నుంచి తప్పించారు. నా యాక్టింగ్ స్కిల్స్ అంత బాగా లేకపోవడమే అందుక్కారణం అని శేష్ తెలిపాడు.
శేష్ పంజా సినిమాతో నటుడిగా బ్రేక్ అందుకుంది 2011లో. హీరోగా 2016లో వచ్చిన క్షణం మూవీతో సక్సెస్ అయ్యాడు. చందమామ వచ్చింది 2007లో. ఒకవేళ ఆ సినిమాలో బాగా పెర్ఫామ్ చేసి ఉంటే.. అప్పుడే అతను బిజీ హీరో అయిపోయేవాడే.
కృష్ణవంశీ ఆర్టిస్టుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకునే దర్శకుడు. ఆషామాషీగా నటిస్తే కుదరదు. నటనలో తొలి అడుగులు వేస్తున్న దశలో శేష్.. కృష్ణవంశీని మెప్పించలేకపోయినట్లున్నాడు. కానీ ఇప్పుడు కృష్ణవంశీ సినిమా చేద్దామన్నా చేసే స్థితిలో లేడు శేష్. తన రేంజే మారిపోయింది. ఈ శుక్రవారం రిలీజవుతున్న శేష్ కొత్త చిత్రం డెకాయిట్ మీద మంచి అంచనాలే ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates