రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఛలో తర్వాత మళ్ళీ అంత పెద్ద హిట్టు తనకు దక్కపోవడం విచిత్రమే. ఇదిలా ఉండగా నాగ శౌర్య కొత్త మూవీ బ్యాడ్ బాయ్ కార్తీక్ ఈ నెల ఏప్రిల్ 17 విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేశారు. తెలిసో తెలియకో తప్పులు చేశామని నిర్మాత హీరోకు సారి చెప్పడం వైరల్ అవుతోంది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే నాగశౌర్య ఈసారి కూడా ఓవర్ మాస్ ట్రై చేసినట్టు ఉన్నాడు. అన్యాయాన్ని సహించని హీరో, ఒక అవినీతి రాజకీయ నాయకుడు, ఒక మాఫియా డాన్, జులాయిలో రాజేంద్ర ప్రసాద్ లాంటి ఒక కామెడీ పోలీస్ ఆఫీసర్ వెరసి పక్కా ఫార్ములా తరహాలో కంటెంట్ వెళ్ళిపోయింది. ఒక షాట్ లో నాగశౌర్య కత్తి పట్టుకుని రౌడీల మీదకు వస్తుంటే వెనుక నరసింహస్వామి స్వరూపాన్ని బ్యాక్ షాట్ లో చూపించడం బోయపాటి శీనుని గుర్తు చేసింది.
దర్శకుడు రమేష్ రిస్క్ లేని గేమ్ ఆడాలని చూసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగశౌర్యని ఇంత మాస్ గా చూపించడం ఒక రకంగా సవాలే. ఇందులో కొన్ని విశేషాలున్నాయి. దీనికి హారిస్ జైరాజ్ సంగీతం సమకూర్చారు. మ్యూజిక్ లవర్స్ చాలా మందికి అసలీ విషయమే తెలియదు. ప్రభాస్ ఈశ్వర్ తో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ ఇందులో నిజాయితీ కలిగిన లాయర్ గా ఒక ముఖ్య పాత్ర పోషించడం గమనార్హం.
ట్రైలర్ కోణంలో చూస్తుంటే కొత్తదనం లేదు కానీ ఆర్టిస్టుల ప్యాడింగ్, టెక్నికల్ వర్క్ గట్రా గట్టిగానే ఉన్నాయి. ఒకవేళ రొటీన్ కథతోనే మాస్ ని మెప్పించేలా ఏమైనా తీసి ఉంటే బాక్సాఫీస్ దగ్గర పనవ్వొచ్చేమో కానీ ఇప్పుడీ ట్రైలర్ వల్ల అంచనాలు అమాంతం పెరగడం లాంటివైతే జరిగేలా లేవు. రిలీజ్ ఇంకా పది రోజుల దూరంలో ఉంది కాబట్టి పబ్లిసిటీ, ప్రమోషన్లు వీలైనంత క్రియేటివ్ గా ప్లాన్ చేసుకోవడం వల్ల బజ్ పెంచుకునే అవకాశాలున్నాయి. చూడాలి మరి ఏం చేస్తారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates