గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రమోషన్లు గట్రా గట్టిగానే చేశారు కానీ పనవ్వలేదు. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఒక సీరియస్ ఇష్యూ మీద సందేశం ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అన్ని వర్గాలను మెప్పించలేకపోయింది. అయినా సరే కొన్ని ప్రశంసలు కూడా వచ్చాయి. తాజాగా ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది.

ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో మాట్లాడుతూ గుణశేఖర్ చాలా ఓపెన్ అయ్యారు. కంటెంట్ ఈజ్ కింగ్ అంటారని, కానీ తాను కింగ్ లాంటి కంటెంట్ ఇస్తే ఆదరణ దక్కలేదని వాపోయారు. ఓటిటి విండోని మూడు నెలలకు పొడిగించకపోతే థియేటర్ మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఇందులో ఆడియన్స్ తప్పేమీ లేదని, అలవాటు చేయడం వల్లే ఇలా జరిగిందని, ఓటిటిల వల్లే జనాలు చిన్న సినిమాలకు థియేటర్లకు రావడం లేదని చెప్పుకొచ్చారు.

కానీ ఇక్కడ కొన్ని లాజిక్స్ మిస్సయ్యారు. ఓటిటి వల్ల పరిశ్రమ ప్రభావితం చెందిన మాట వాస్తవమే కానీ ఆడియన్స్ పూర్తిగా థియేటర్లకు దూరం కావడం నిజం కాదు. అలా అయితే లిటిల్ హార్ట్స్ కు ముప్పై కోట్ల వసూళ్లు ఎలా వస్తాయి. ఎంత చిరంజీవి ఉన్నా మన శంకరవరప్రసాద్ గారుకి కేవలం క్రేజ్ వల్ల మూడు వందల కోట్లు రాలేదుగా. చాలా అంశాలు పని చేసాయి. అన్నింటికి కంటెంటే ముఖ్యం. అది ఉన్నప్పుడు జనం ఎంత బడ్జెట్ పెట్టారు ఎవరు నిర్మాత లాంటివి పట్టించుకోరు.

ఇక ఓటిటి గ్యాప్ ని తొంభై రోజులకు పెంచడం స్టార్ హీరోల సినిమాలకు మేలు చేయొచ్చేమో కానీ చిన్న చిత్రాలకు మాత్రం ఖచ్చితంగా దెబ్బే. డిజిటల్ లో లేట్ గా వస్తుంది కాబట్టి బాలేని మూవీని కూడా థియేటర్లో చూద్దామనుకునే ప్రేక్షకులు ఇప్పటి జనరేషన్ లో లేరు. అలాంటప్పుడు లాంగ్ విండో పని చేయదు. కట్టడి అవసరమే కానీ మరీ ఇంత తీవ్రంగా కాదు. యుఫొరియాలో మెసేజ్ చెప్పే ఉద్దేశంతో డ్రామాని మరీ ఓవర్ ఇంటెన్స్, డెప్త్ గా తీయడం వల్ల జనాలకు అనలేదు కానీ లేదంటే ఇదీ హిట్టు కొట్టేదిగా.