ప్రశాంత్ వర్మ పంట పండినట్లే

నాలుగు నెలలు వెనక్కి వెళ్తే.. అక్షయ్ ఖన్నా అనే నటుడి గురించి బాలీవుడ్లోనే పెద్దగా పట్టింపు ఉండేది కాదు. కానీ ‘దురంధర్’ సినిమా రిలీజయ్యాక ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ యాక్టర్లలో ఒకడైపోయాడు అక్షయ్. వందకు పైగా సినిమాలు చేసినా రాని గుర్తింపు.. ఈ ఒక్క చిత్రంలో విలన్ పాత్ర చేయడంతో వచ్చింది. హీరో రణ్వీర్ సింగ్‌ను కూడా డామినేట్ చేసే స్థాయిలో అతను రెహమాన్ దెకాయత్ పాత్రను పోషించి ప్రేక్షకులను ఉర్రూతూలగించాడు.

ఈ సినిమాతో ఒక్కసారిగా తన పారితోషకం పెరిగిపోయింది. తన డేట్ల కోసం దర్శకులు, నిర్మాతలు క్యూలు కట్టే పరిస్థితి వచ్చింది. ఐతే ‘దురంధర్’ రిలీజ్ కావడానికి ముందే అక్షయ్‌ని లాక్ చేసిన దర్శక నిర్మాతలది అదృష్టం అనే చెప్పాలి. టాలీవుడ్ దర్శక నిర్మాత ప్రశాంత్ వర్మ ఈ జాబితాలో ఉన్నాడు. తన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్’లో భాగంగా ‘హనుమాన్’ తర్వాత అతను నిర్మిస్తున్న ‘మహంకాళి’ సినిమాలో అక్షయ్ ఖన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్.. శుక్రాచార్యుడి పాత్ర పోషిస్తున్నాడు.

ప్రశాంత్ వర్మ స్క్రిప్టుతో, అతడి దర్శకత్వ పర్యవేక్షణలో ‘మార్టిన్ లూథర్ కింగ్’ దర్శకురాలు పూజ కొల్లూరు ‘మహంకాళి’ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. ఇందులో అక్షయ్ పాత్ర షూట్ కూడా పూర్తి చేసేశారు. శనివారం అక్షయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన శుక్రాచార్యుడి అవతారంలో ఉన్న ఆన్ లొకేషన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పాడు ప్రశాంత్ వర్మ.

ఈ పోస్టుకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు అక్షయ్ వల్ల పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు. ‘హనుమాన్’ దర్శకుడిగా ప్రశాంత్‌ బ్రాండ్ వాల్యూ కూడా తోడవుతుంది కాబట్టి.. సినిమాలో కంటెంట్ బలంగా ఉంటే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి అవకాశముంది. ‘దురంధర్’ తర్వాత రిలీజయ్యే అక్షయ్ సినిమా ఇదే కావడం దీని పట్ల ప్రేక్షకులు అమితాసక్తి ప్రదర్శిస్తారు కాబట్టి ప్రశాంత్ వర్మ అండ్ టీం పంట పండినట్లే.