భారీ అంచనాలతో వచ్చే ఓ సినిమా ఆ అంచనాలను అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. పదిలో ఏడెనిమిది సినిమాలను అంచనాలను అందుకోవడంలో విఫలమవుతుంటాయి. అలాంటిది దురంధర్: ది రివెంజ్ సినిమా అంచనాలను అందుకోవడమే కాదు, మించిపోయింది. దురంధర్ కంటే ఇది బెటర్ మూవీ అని ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇందులో ఉన్న రాజకీయ భావజాలం, మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా తీసిన సన్నివేశాలు, మితిమీరిన హింస, అతిశయోక్తులు వీటి గురించి విమర్శలు ఉన్నప్పటికీ.. నాలుగ్గంటల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించడంలో మాత్రం దురంధర్-2 విజయవంతమైంది.
సినిమాకు అదిరిపోయే టాక్, రివ్యూలు రావడంతో వరల్డ్ వైడ్ దురంధర్-2 ఆడుతున్న థియేటర్లకు జనాలు పోటెత్తుతున్నారు. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్, సాంకేతిక నిపుణుల పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరూ వంద శాతం ఎఫర్ట్ పెట్టడంతో ఔట్ పుట్ అదిరిపోయింది.
ఐతే దురంధర్-2లో అన్నీ బాగానే ఉన్నా.. ఒక్క లోటు మాత్రం ఉండిపోయింది. అక్షయ్ ఖన్నా లేకపోవడమే ఆ లోటు. పార్ట్-1లో అక్షయ్ చేసిన రెహమాన్ దైకత్ పాత్ర మామూలుగా పేలలేదు. ఆ పాత్రను ఆదిత్య ధర్ భలేగా డిజైన్ చేస్తే.. అక్షయ్ ఖన్నా తనదైన పెర్ఫామెన్స్‌తో దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లాడు.
అక్షయ్ కాకుండా ఇంకెవరు ఉన్నా ఆ పాత్ర అంత హైలైట్ కాకపోయేదన్నది స్పష్టం. దురంధర్ రిలీజయ్యాక హీరో రణ్వీర్ సింగ్ కంటే విలన్ అక్షయ్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. రీల్స్, షార్ట్స్ అన్నింట్లోనూ తన వీడియోలే మోతెక్కిపోయాయి. రణ్వీర్ కూడా అద్భుతంగా నటించినా.. అక్షయే సినిమాకు హైలైట్‌గా నిలిచాడు.
ఐతే దురంధర్‌లో రెహమాన్ పాత్ర ముగిసిపోవడంతో పార్ట్-2లో అక్షయ్ కనిపించలేదు. గ్లింప్స్ లాగా చూపించారే తప్ప.. తన పాత్ర ఇందులో లేదు. ఇక్కడ ప్రధాన విలన్ అర్జున్ రాంపాల్ అయ్యాడు. అతను మేజర్ ఇక్బాల్ పాత్రలో అదరగొట్టాడు. మరోవైపు రణ్వీర్ అదరగొట్టాడు. సంజయ్ దత్, రాకేష్ బేడీ సైతం గొప్పగా పెర్ఫామ్ చేశారు. అయినా సరే.. అక్షయ్ లేని లోటు మాత్రం కనిపించింది. ఆ శ్వాగ్ ఇంకెవరికీ సాధ్యం కాలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates