‘దురంధర్: ది రివెంజ్’ సినిమా రిలీజైనపుడు ఇండియన్ బాక్సాఫీస్ షేకైపోతుందని ముందు నుంచి ఉన్న అంచనానే. ఐతే ఇప్పుడీ సినిమా ప్రభంజనం చూస్తుంటే అంచనాలను మించిపోయినట్లే కనిపిస్తోంది. రోజువారీ బాక్సాఫీస్ నంబర్లు చూసి ట్రేడ్ పండిట్లకు కూడా దిమ్మదిరిగిపోతోంది.
ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ముందు రోజు ప్రిమియర్లతో కలిపితే డే 1 ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రెండో రోజు వసూళ్లు కొంతమేర తగ్గాయి. కానీ శనివారం వీకెండ్ కావడం, రంజాన్ సెలవు కూడా కలిసి రావడంతో వరల్డ్ వైడ్ వసూళ్ల మోత మోగించేసింది ‘దురంధర్ 2’.
శుక్రవారంతో పోలిస్తే శనివారం వసూళ్లు 40 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఒక్క రోజే ‘దురంధర్ 2’ రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. తొలి రెండు రోజుల్లో తెలుగు, తమిళ వెర్షన్లు రిలీజ్ కాని సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం నుంచి ఇవి కూడా అందుబాటులోకి రావడంతో వసూళ్లు మరింత పెరిగాయి.
ఆదివారం కూడా ‘దురంధర్ 2’ భారీ వసూళ్లతో సాగిపోతోంది. మ్యాట్నీల నుంచి మెజారిటీ షోలు హౌస్ ఫుల్స్‌తో నడుస్తున్నాయి. నాలుగో రోజు కూడా ఈ సినిమా వంద కోట్లకు తగ్గకుండా కలెక్షన్లు రాబట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఎక్స్‌టెండెడ్ వీకెండ్లో ఈ సినిమా రూ.600 కోట్ల మైలురాయిని అందుకోబోతోంది. ఒక హిందీ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇప్పటిదాకా ఎన్నడూ జరగలేదు. ‘దురంధర్’ పార్ట్ 1 ఫుల్ రన్లో రూ.1400 కోట్ల వసూళ్లు రాబట్టగా ‘దురంధర్ 2’ ఏకంగా రూ.2 వేల కోట్ల మైలురాయిని అందుకుంటుందని రిలీజ్ ముంగిట ట్రేడ్ పండిట్లు అంచనా వేశారు.
వీకెండ్ వరకు ఈ సినిమా ప్రభంజనం చూస్తే అదేమీ కష్టమైన టార్గెట్ కాదనే అనిపిస్తోంది. రెండో వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం రూ.1000 కోట్ల మైలురాయిని అందుకోవడం లాంఛనమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates