కిరణ్ అబ్బవరం వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సమయంలో అతడికి గొప్ప ఉపశమనాన్ని అందించిన సినిమా.. క. మలయాళం థ్రిల్లర్లను తలపించేలా సాగిన ఈ సినిమా.. 2024 దీపావళికి విడుదలై తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కిరణ్ కెరీర్లో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. కిరణ్ ఈ సినిమాను ఎంతగా ఓన్ చేసుకున్నాడో అందరికీ తెలుసు.
కెరీర్లో ఒక గ్యాప్ తీసుకుని చాలా టైం పెట్టి, శ్రద్ధగా ఈ సినిమాను పూర్తి చేశాడు. పెర్ఫామెన్స్ పరంగా కూడా ది బెస్ట్ ఇచ్చాడు. ఇలాంటి హిట్ మూవీకి సీక్వెల్ అంటే ఆటోమేటిగ్గా అదే హీరో లీడ్ రోల్ చేస్తాడని అనుకుంటాం. కానీ ఆ చిత్ర దర్శకులు సందీప్ సుజీత్.. నిర్మాతలు కలిసి వేరే ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో ఈ సీక్వెల్‌ను పట్టాలెక్కించబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఇది కిరణ్ అభిమానులను నిరాశకు గురి చేసింది.
మరి ఈ సీక్వెల్ తన చేతి నుంచి వెళ్లిపోవడంపై కిరణ్ ఫీలింగ్ ఏంటో తెలుసుకుందామని విలేకరులు ప్రయత్నిస్తే.. అతను దీన్ని కాంట్రవర్శీ చేయకుండా సింపుల్‌గా జవాబిచ్చాడు. క సీక్వెల్ ఇంకెవరో చేస్తున్నారట కదా, మీరెందుకు చేయట్లేదు అని అడిగితే.. ఏమోనండీ దాని గురించి ఏ చర్చా జరగలేదు, ఎవరూ నాతో మాట్లాడలేదు, ఆ చర్చ నా వరకు రాలేదు అని కిరణ్ వ్యాఖ్యానించాడు.
కిరణ్ మాటల్ని బట్టి చూస్తుంటే.. సీక్వెల్ వేరొకరితో తీయబోతున్నారని తెలిసి ఆ విషయాన్ని లైట్ తీసుకున్నట్లున్నాడు. దీన్ని వివాదం చేయకూడదన్న ఉద్దేశంతో అతను హుందాగా స్పందించిన తీరు ప్రశంసనీయం.
ఇక తన నిర్మాణంలో తెరకెక్కిన తిమ్మరాజుపల్లి టీవీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది ప్రేక్షకులను చాలా ఏళ్లు వెనక్కి తీసుకెళ్లే వింటేజ్ ఫన్ ఫిలిం అని కిరణ్ చెప్పాడు. ఈ సినిమా వల్ల తనకు డబ్బులు వస్తాయో లేదో కానీ.. దీని కోసం పని చేసిన కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణుల జీవితాలు మాత్రం మారిపోతాయని అతను ధీమా వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
