దురంధ‌ర్ ద‌ర్శ‌కుడి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం

ఒక క‌థ‌ను రెండు భాగాలుగా చెప్ప‌డం.. ముగిసిన క‌థ‌కు సీక్వెల్ చేయ‌డం.. లేదంటే కొన్ని పాత్ర‌ల‌తో ఒక వ‌ర‌ల్డ్ క్రియేట్ చేసి ఫ్రాంఛైజీ సినిమాలు చేయ‌డం.. ఇప్పుడు ఇండియ‌న్ సినిమాలో ట్రెండ్. బాహుబలి త‌ర్వాత ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. అవ‌సరం ఉన్నా లేక‌పోయినా సీక్వెల్స్ అనౌన్స్ చేసేస్తున్నారు. కొంద‌రు అన‌వ‌స‌రంగా క‌థ‌ల‌ను సాగ‌దీస్తున్న ఫీలింగ్ కూడా క‌లుగుతోంది.

కానీ కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ మాత్రం క‌థ ప‌రిధి పెద్ద‌ది కావ‌డంతో త‌ప్ప‌నిస‌రై రెండు మూడు భాగాలుగా సినిమాలు తీస్తున్నారు. దీని వ‌ల్ల ఏది ఉంచాలి.. ఏది తీసేయాల‌నే మీమాంశం ఉండ‌దు. క‌థ డిమాండ్ చేస్తే లెంత్ గురించి భ‌య‌ప‌డాల్సిన ప‌ని ఉండ‌దు. బ‌డ్జెట్ పెంచుకోవ‌చ్చు..రిక‌వ‌రీ కూడా ఈజీ అవుతుంది. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఒక క‌థ‌ను మ‌ధ్య‌లో ఆపాక‌.. త‌ర్వాతి భాగం చూడ‌డానికి ఏళ్ల త‌ర‌బ‌డి వేచి చూడాల్సి రావ‌డ‌మే ప్రేక్ష‌కుల‌కు అస‌హ‌నం క‌లిగిస్తోంది.

బాహుబ‌లి తొలి భాగం వ‌చ్చాక.. రెండో భాగం చూడడానికి దాదాపు రెండేళ్లు ఎదురు చూడాల్సి వ‌చ్చింది. పుష్ప, పుష్ప‌-2కు మ‌ధ్య ఏకంగా మూడేళ్ల గ్యాప్ వ‌చ్చింది. కేజీఎఫ్ సీక్వెల్ కోసం కూడా ఇంతే స‌మ‌యం ప‌ట్టింది. స‌లార్, క‌ల్కి, దేవ‌ర‌ సినిమాల సీక్వెల్స్ కోసం కూడా సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ప్పేలా లేదు. ముందు ఒక క‌థ అనుకుని.. మ‌ళ్లీ మార్పులు చేర్పులు చేయ‌డం.. బ‌డ్జెట్ పెంచేయ‌డం.. సినిమా స్కేల్ కూడా మారిపోవ‌డం.. డేట్లు స‌ర్దుబాటు చేయ‌డంలో ఇబ్బందులు.. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో సీక్వెల్స్ విప‌రీతంగా ఆల‌స్యం అవుతున్నాయి.

కానీ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ మాత్రం దురంధ‌ర్ సీక్వెల్ కోసం ప్రేక్ష‌కుల‌ను ఇలా వెయిట్ చేయించ‌లేదు. దురంధ‌ర్ వ‌చ్చిన మూడున్న‌ర నెల‌ల‌కే దురంధ‌ర్-2ను థియేట‌ర్ల‌లోకి తెచ్చేశాడు. పార్ట్-1 తీస్తున్న‌పుడే రెండో భాగానికి కూడా చాలా వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ పూర్తి చేశాడు ఆదిత్య‌. ఆ త‌ర్వాత బ్యాలెన్స్ షూట్ పూర్తి చేశాడు.

సీక్వెల్‌కు ఉన్న హైప్ చాలు, మ‌నం కంటెంట్ మీద దృష్టిపెడితే చాల‌నుకుని.. ప్ర‌మోష‌న్ల జోలికే వెళ్ల‌లేదు. పూర్తిగా మేకింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ మీదే దృష్టిపెట్టాడు. పార్ట్-2 కోసం అన‌వ‌స‌ర హంగామా చేయ‌లేదు. క‌థ‌ను మార్చ‌డం.. అద‌నపు హంగులు జోడించ‌డం.. ఇవేవీ చేయ‌లేదు. చాలా సింపుల్‌గా ప‌ని పూర్తి చేశాడు. అత‌డి న‌మ్మ‌క‌మంతా సినిమా మీదే. ఉన్న కంటెంట్ చాలు.. అంచ‌నాలు పెరిగాయి క‌దా అని ఇంకేదో చేసేయాలని చూడ‌లేదు. అత‌డి న‌మ్మ‌కం ఫ‌లించింది.

దురంధ‌ర్-2 చూసి అంద‌రూ మెచ్చుకుంటున్నారు. పార్ట్-1ను మించిన సినిమా అని కొనియాడుతున్నారు. పార్ట్-1 హిట్ అవ్వ‌గానే అంచ‌నాల‌ను మ్యాచ్ చేయ‌డానికి ఏదో చేసేయాల‌న్న తాప‌త్ర‌యం అవ‌స‌రం లేద‌ని.. కంటెంట్‌ను న‌మ్మి, ప‌క్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగితే.. త్వ‌ర‌గానే రెండో భాగాన్ని రిలీజ్ చేయొచ్చ‌ని.. ప్రేక్ష‌కులు దీన్ని ఎంతో హ‌ర్షిస్తార‌ని.. రిజ‌ల్ట్ కూడా కూడా అందుకు త‌గ్గ‌ట్లే వ‌స్తుంద‌ని ఆదిత్య రుజువు చేశాడు. మరి మ‌న ద‌ర్శ‌కులు కూడా ఇక‌పై ఇదే బాట‌లో సాగుతారేమో చూడాలి.