గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ అవార్డులను రెగ్యులర్‌గా ప్రకటించడానికి పూనుకున్న ప్రభుత్వం.. ఇటీవలే 2025 సంవత్సరానికి పురస్కారాలు ప్రకటించింది. ఈ అవార్డుల వేడుకను ఉగాది రోజున హైటెక్స్ వేదికగా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి.
కానీ చివరికి చూస్తే ఆ వేడుక గందరగోళంగా మారి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఏర్పాట్లు సరిగా చేయకపోవడం, మేనేజ్మెంట్ బాధ్యతలు ముంబై సంబంధిత సంస్థకు ఇవ్వడం, సమన్వయం లేకపోవడం.. ప్లానింగ్ లోపం వల్ల అయోమయ పరిస్థితులు తలెత్తినట్లు తెలుస్తోంది. చాలామంది అవార్డు విజేతలకు కుర్చీలు కూడా లేక నిలబడే వేడుకను చూడాల్సిన పరిస్థితి తలెత్తిందట. సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి సహా కొందరు దిగ్గజాలకు ముందు వరుసలో సీట్లు కేటాయించకపోవడంతో వాళ్లు వెనక్కి వెళ్లిపోయారు.
మరోవైపు లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌కు అవమానం జరిగి ఆయన ఈ వేడుక నుంచే వెళ్లిపోయినట్లు సమాచారం. అంత పెద్ద రచయితను గుర్తించలేక ఆర్.నారాయణమూర్తిగా పేర్కొనడంతో హర్టయి వెనక్కి వెళ్లిపోయారట రాజమౌళి తండ్రి. మరోవైపు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాతో పాటుగా వచ్చిన బౌన్సర్లకు.. దిల్ రాజు పర్సనల్ అసిస్టెంట్‌కు మధ్య పెద్ద గొడవ జరిగి.. ఆ పీఏను ఈవెంట్ నుంచి పంపించేయాల్సి వచ్చినట్లు సమాచారం.
ఇలా గద్దర్ అవార్డుల వేడుక మొత్తం గందరగోళంగా తయారైందని.. ఏర్పాట్లు ఘోరమని.. ప్లానింగ్ పేలవమని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వేడుకకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సుమ, ప్రదీప్ మాచిరాజుల మీద కూడా విమర్శలు తప్పట్లేదు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వేడుకలో వాళ్లిద్దరూ చిరంజీవి సతీమణి దగ్గరికెళ్లి ఈ రోజు వంటలేంటి అంటూ ముచ్చట్లు పెట్టడం విమర్శలకు దారి తీసింది. ఇలా మొత్తంగా గద్దర్ అవార్డుల వేడుక నిర్వహణ అనేక విమర్శలకు కారణమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
