పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మెమొరబుల్ హిట్స్‌లో ‘గబ్బర్ సింగ్’ ఒకటి. ఆ సినిమాతో అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ పంచిన ఆనందం అంతా ఇంతా కాదు. ఐతే అంత పెద్ద సక్సెస్ కొట్టాక మళ్లీ అదే హీరోతో సినిమా చేయడానికి పుష్కరం పైగానే పట్టింది. ఐతే ఈసారి పవన్‌తో హరీష్ శంకర్ సినిమా చేస్తుంటే.. అభిమానుల్లో అంత ఎగ్జైట్మెంట్ కనిపించలేదు.
ఇది రీమేక్ అన్న ప్రచారానికి తోడు సినిమా బాగా ఆలస్యం కావడం ఒక ముఖ్య కారణం. దీనికి తోడు హరీష్ శంకర్ ఫామ్‌లో లేకపోవడం కూడా అభిమానులను టెన్షన్ పెట్టింది. హరీష్ చివరి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. ఐతే హరీష్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడ్డారు కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం అలాంటి ఫీలింగ్ ఏమీ పెట్టుకోలేదట. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడాడు.
‘మిస్టర్ బచ్చన్’ నిరాశపరిచిన నేపథ్యంలో ఆ విషయాన్ని పవన్ దగ్గర ప్రస్తావించి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకొంచెం జాగ్రత్తగా చేద్దాం అంటూ తాను మాట్లాడితే.. పవన్ స్పందన తనను ఆశ్చర్యపరిచిందని హరీష్ వెల్లడించాడు.
‘‘నా చివరి సినిమా సరిగా ఆడలేదు కదా’’ అని అంటే.. ‘‘ఐతే ఏంటి? కష్టపడి సినిమాలు చేస్తాం. హిట్టా ఫ్లాపా అన్నది మన చేతుల్లో ఉండదు. నువ్వు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నావు. ఎంత తపన పడుతున్నావు అన్నది ముఖ్యం. ఈ సినిమా కోసం నువ్వెంత ఎఫర్ట్ పెడుతున్నావో తెలుసు. అయిపోయిన సినిమా గురించి బాధపడకు. ఈ సినిమా మీద దృష్టిపెట్టు. దీని కోసం ఏం కావాలో అది నేను చేస్తా’’ అంటూ పవన్ తనకు భరోసా ఇచ్చాడని హరీష్ వెల్లడించాడు.
ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విశేషాల గురించి హరీష్ మాట్లాడుతూ.. ‘గబ్బర్ సింగ్’లో ఎలా అయితే ఫ్యాన్ మూమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్, రొమాంటిక్ ట్రాక్, కామెడీ ఇలా ప్రతిదీ ఉన్నాయో.. ఈ చిత్రం కూడా ఒక విందుభోజనంలా ఉంటుందని.. ఇప్పుడు తెలుగు సినిమా పరిధి ఇంకా పెరిగిన నేపథ్యంలో కేవలం అభిమానులనే కాక అందరినీ మెప్పించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశామని.. కుటుంబంలో అందరికీ ఈ సినిమా నచ్చుతుందని హరీష్ ధీమా వ్యక్తం చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
