వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత కల్ట్ తో మెగా ఫోన్ పట్టుకున్నాడు. కథ స్క్రీన్ ప్లే కూడా సమకూర్చుకుని మాటలు మాత్రం తరుణ్ భాస్కర్ కి ఇవ్వడం విశేషం. టాలీవుడ్ మొదటి స్లాషర్ మూవీగా దీని గురించి విశ్వక్ ప్రత్యేకంగా ప్రమోషన్ చేస్తున్నాడు.
చిన్నపిల్లలు, సున్నిత మనస్కులు దూరంగా ఉండమంటూ ముందే హింట్ ఇవ్వడం ద్వారా కంటెంట్ ఏ స్థాయిలో ఉందో అవగాహన కలిగిస్తున్నాడు. మొత్తానికి మూడు నిమిషాలకు దగ్గరగా ఉన్న టీజర్ లాంచ్ ఇవాళ హైదరాబాద్ పీసీఎక్స్ స్క్రీన్ లో ఘనంగా జరిగింది.
కథను దాచలేదు. గోవాలో కల్ట్ పేరుతో ఈవెంట్ జరుగుతుంది. దాంట్లో పాల్గొనే వాళ్ళు ఒక విలాసవంతమైన భవంతిలోకి అడుగు పెట్టాలి. ఇష్టమొచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. జీమూమ్బా అనే యానిమేషన్ క్యారెక్టర్ వచ్చి మీకు గేమ్స్ పెడతామని చెప్పి ఊరిస్తుంది.
వందల్లో వచ్చిన యువతీ యువకులు ఉత్సాహంగా సరేనంటారు. ఎలిమినేట్ అయినవాళ్లకు చాలా దారుణమైన మరణశిక్ష ఉంటుంది. ఎటువైపు నుంచి కత్తి వస్తుందో అర్థం చేసుకునే లోపే తల, శరీర భాగాలు తెగిపడి ఉంటాయి. బయటికి వెళ్లే ఛాన్స్ ఉండదు. అప్పుడు వస్తాడు అసలు నిర్వాహకుడు (విశ్వక్ సేన్). ఇదంతా ఏంటి అనేది సినిమాలో చూడాలి.
వయొలెన్స్ ని పీక్స్ కు తీసుకెళ్ళిపోయిన విశ్వక్ సేన్ ఈసారి ప్యూర్ అడల్ట్స్ కంటెంట్ ఎంచుకున్నాడు. బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ ని స్ఫూర్తిగా తీసుకున్న వైనం కొన్ని సీన్స్ లో కనిపిస్తోంది. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దానికి తగ్గట్టే ఉంది. మొత్తం ఒకే బిల్డింగ్ లో ఉంటుందా లేక బయట కూడా ఏమైనా ఎపిసోడ్స్ ఉంటాయానేది ఇప్పుడే చెప్పలేం.
గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన కల్ట్ లో పొన్నప్పని తప్ప ఎవరినీ రివీల్ చేయలేదు. మరి కల్ట్ అంటూ ఎప్పుడూ ట్రై చేయని రూటు పట్టుకున్న విశ్వక్ ఈసారి ఏం రిజల్ట్ అందుకుంటాడో లెట్ వెయిట్ అండ్ సీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates