విష్ణు డ‌బుల్ ధ‌మాకా లేదు

ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు రిలీజ్ కావడం అన్న‌ది రేర్ ఫీట్. తెలుగులో ఈ రికార్డు నంద‌మూరి బాల‌కృష్ణ‌, నానిల పేరు మీద మాత్ర‌మే ఉంది. తొంభైవ దశకంలో నందమూరి బాలకృష్ణ చిత్రాలు ‘బంగారు బుల్లోడు’, ‘నిప్పురవ్వ’ ఇలా రిలీజ్ కాగా.. మళ్లీ చాలా ఏళ్లకు నేచురల్ స్టార్ నాని మూవీస్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై కపిరాజు’ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

రెండుసార్లూ ఒక సినిమా బాగా ఆడింది. ఇంకోటి దెబ్బ తింది. ఐతే గ‌త ఏడాది త‌మిళ హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ ఈ ఫీట్ రిపీట్ చేసేలా క‌నిపించాడు. అత‌డి సినిమాలు డ్యూడ్, ఎల్ఐకే దీపావళి పోటీకి సై అన్నాయి కానీ.. తర్వాత ‘డ్యూడ్’ మాత్రమే రిలీజైంది. ‘ఎల్ఐకే’ వెనక్కి వెళ్లిపోయింది.

ఐతే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు సినిమాలు విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ ఒక్క రోజు వ్య‌వ‌ధిలో రిలీజ్ కానున్న‌ట్లు ఇటీవ‌ల అప్‌డేట్స్ వ‌చ్చాయి. ఈ నెల 27న మృత్యుంజ‌య్, 28న విష్ణువిన్యాసం రిలీజ‌వుతాయ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కానీ ఇప్పుడు క‌థ మారింది. శ్రీ విష్ణు కూడా ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ బాట‌లో న‌డిచాడు. ఒక సినిమాను వాయిదా వేయించాడు.

ఈ నెల చివ‌రి వారంలో విష్ణు విన్యాసం మాత్ర‌మే విడుద‌ల కానుంది. చెప్పినట్లే ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. మృత్యుంజయ్ వాయిదా పడనుంది. ఈ విషయాన్ని విష్ణు విన్యాసం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో విష్ణు ధ్రువీకరించాడు. మృత్యుంజయ్ కొత్త రిలీజ్ డేట్ మేకర్స్ ప్రకటిస్తారని అతను చెప్పాడు.

కొన్ని రోజుల ముందు ఈ రెండు చిత్రాలు ఒకే డేటుకు వస్తాయి అన్నపుడు తాను చాలా టెన్షన్ పడ్డట్లు విష్ణు వెల్లడించాడు. ఆ టైంలో ఏం చెయ్యాలో అర్థం కాలేదని.. ఐతే ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు, హీరోలు ఫోన్ చేసి టెన్షన్ పడొద్దు అని చెప్పారన్నాడు.

తన పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని.. అవసరం అయితే తాము సినిమాను ప్రమోట్ చేసి పెడతాం అని కూడా హమీ ఇచ్చారన్నాడు. తాను ఎవరిని అలా హెల్ప్ అడగనని, కానీ అంతమంది తనకు కాల్ చేసి భరోసా ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని విష్ణు చెప్పాడు.