కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం ఇందుకు భిన్నమైన దారిలో ప్రయాణం చేశాడు. తొలి సినిమా ‘ముకుంద’ నుంచి అతడి రూటే వేరు అన్నట్లే సాగింది. కంచె, ఫిదా, లోఫర్, తొలి ప్రేమ, ఎఫ్-2.. ఇలా ఒకదాంతో ఒకటి సంబంధం లేని సినిమాలే చేశాడు. వాటిలో ఎక్కువగా విజయవంతం అయ్యాయి. కానీ గత నాలుగైదేళ్లలో మాత్రం వరుణ్ కెరీర్ గాడి తప్పింది. విభిన్నమైన సినిమాలే చేసినప్పటికీ.. సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆపరేషన్ వాలెంటైన్, గాండీవధారి అర్జున, గని, మట్కా.. ఈ చిత్రాలన్నీ డిజాస్టర్లే అయ్యాయి.

ఇప్పుడతను ‘కొరియన్ కనకరాజు’ లాంటి ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాను కొవిడ్ టైంలో ఓటీటీ కంటెంట్ ఎక్కువ చూడడం వల్ల వాటి ప్రభావంతో చేసిన సినిమాలు తనను దెబ్బ కొట్టాయని అతను అభిప్రాయపడ్డాడు.

కరోనా టైంలో బోలెడన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూశానని.. ప్రేక్షకులకు సీరియస్ థ్రిల్లర్స్ నచ్చుతున్నాయన్న ఉద్దేశంతో గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ లాంటి సినిమాలు చేశానని చెప్పాడు. ఐతే ఈ సినిమాల్లో లోపాలుండడం వాస్తవమే అయినప్పటికీ.. ఈ తరహా చిత్రాలను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు తర్వాత ఆసక్తి చూపించకపోవడం మైనస్ అయిందని అతను అభిప్రాయపడ్డాడు. 

హృతిక్ రోషన్ సినిమా ‘ఫైటర్’ వచ్చిన కొన్ని వారాలకే ‘ఆపరేషన్ వాలెంటైన్’ రిలీజవడంతో మళ్లీ అలాంటి సినిమాకు డబ్బులు ఎందుకు పెట్టడం అని ప్రేక్షకులు భావించారని వరుణ్ అన్నాడు. గని, మట్కా కూడా మరీ సీరియస్ సినిమాలు కావడం మైనస్ అయిందని.. ఆ సినిమాలు మొదలయ్యే సమయంలో ట్రెండీగా అనిపించినా.. రిలీజ్ టైంకి ట్రెండ్ మారిపోయి, అప్పటికి అవి సరైన సినిమాల్లా అనిపించలేదని వరుణ్ అన్నాడు.

మొత్తంగా కొవిడ్ టైంలో ఉన్న మైండ్ సెట్‌తో చేసిన సినిమాలు తనకు సరైన ఫలితాలను ఇవ్వలేదని, తనను జనాలు ఎంటర్టైనర్లలో చూడాలనుకుంటన్నారనే విషయాన్ని గ్రహించి ‘కొరియన్ కనకరాజు’ చేశానని వరుణ్ తెలిపాడు.