సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం విశేషం. 19 ఏళ్ల వయసులోనే ‘దేవి’ సినిమాతో సంగీత దర్శకుడిగా తన ప్రయాణం మొదలైంది. ఇంకొన్నేళ్లకే టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. ఆ తర్వాత నంబర్ వన్ స్థానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.
మణిశర్మ జోరు తగ్గాక చాలా ఏళ్ల పాటు అతనే తెలుగులో పెద్ద సినిమాలకు ఫస్ట్ ఛాయిస్‌గా ఉన్నాడు. ఐతే గత కొన్నేళ్లలో తమన్, అనిరుధ్ రవిచందర్ విజృంభించడంతో అతడి దూకుడు తగ్గింది. సినిమాలు తగ్గాయి. తన సంగీతంలో క్వాలిటీ కూడా తగ్గిందనే విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో ‘యల్లమ్మ’ చిత్రంతో హీరో అవతారం ఎత్తుతుండడంతో సంగీతం మీద దేవిశ్రీ ఫోకస్ తగ్గిపోయిందని.. ఇక తన పనైపోయిందనే కామెంట్లు వినిపించాయి. కానీ దేవి చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ విజృంభించబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
నిన్న దేవి పుట్టిన రోజు సందర్భంగా వచ్చిన అనౌన్స్‌మెంట్లు తన అభిమానుల్లో అంచనాలను పెంచాయి. ‘యల్లమ్మ’ నుంచి పార్శి పాత్రలో దేవిని పరిచయం చేయగా.. ఈ చిన్న గ్లింప్స్‌లో సంగీత పరంగా తన మార్కు చూపించాడతను. ఇంటెన్స్‌గా, కొత్తగా అనిపించే సౌండింగ్‌తో ‘యల్లమ్మ’ మ్యూజిక్‌పై అంచనాలు పెంచాడు దేవి. మరోవైపు అక్కినేని నాగార్జున కెరీర్లో మైలురాయి అయిన వందో సినిమాకు కూడా దేవినే సంగీత దర్శకుడిగా ప్రకటించారు. నాగ్‌తో దేవికిది ఐదో సినిమా కావడం విశేషం.
వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే కావడం, నాగ్‌కిది ప్రెస్టీజియస్ మూవీ కావడంతో దేవి తన సంగీతంతో ఉర్రూతలూగిస్తాడనడంలో సందేహం లేదు. మరోవైపు కార్తి కెరీర్లో 30వ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవినే ప్రకటించారు. మొత్తంగా దేవి పనిచేయనున్న సినిమాలన్నీ అమితాసక్తి రేకెత్తిస్తున్నవే. ఇక సుకుమార్, రామ్ చరణ్ కలయికలో రాబోతున్న కొత్త సినిమాకు దేవి పని చేస్తాడా లేదా అన్నదే తేలాల్సి ఉంది. తొలిసారిగా దేవి లేకుండా వేరే సంగీత దర్శకుడితో సుక్కు పూర్తి స్థాయిలో ఒక సినిమాకు పని చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
