స్మార్టుగా తప్పించుకున్న మాస్ మహారాజా

ఏదో కామెడీతో ఆడేస్తుందనుకున్న ఫంకీ మొదటి వారంలోనే చేతులెత్తేయడం ఊహించని పరిణామం. పెద్దగా పోటీ లేని అవకాశాన్ని వాడుకోలేకపోవడం విశ్వక్ సేన్ అభిమానులను బాధ పెట్టింది. దర్శకుడు అనుదీప్ ని గుడ్డిగా నమ్మిన వైనం కాసింత ఓపెనింగ్స్ అయితే తెచ్చింది కానీ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వలేకపోయింది.

దీనికి రవితేజకు కనెక్షన్ ఏంటనే విషయానికి వస్తే ఇదే సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రవితేజతో సినిమా చేసేందుకు అనుదీప్ ఒక స్టోరీ లాక్ చేశాడు. గతంలో మాస్ మహారాజా పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెబుతూ ఈ ప్రాజెక్టుని ఇన్ డైరెక్ట్ గా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత పట్టాలు ఎక్కకపోవడం వేరే సంగతి.

బడ్జెట్ ఇష్యూస్ తో పాటు అనుదీప్ చెప్పిన ఎంటర్ టైనర్ తన మీద ఇప్పుడు వర్కౌట్ కాదని భావించిన రవితేజ దాన్ని అందుకే వద్దనుకున్నారట. అది ఫంకీనో కాదో ఖచ్చితంగా తెలియదు కానీ ఆ తర్వాతే సీన్ లోకి విశ్వక్ సేన్ వచ్చాడు. ఫంకీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదంతా గ్యాంగ్ అఫ్ గోదావరి సమయంలో జరిగింది.

నేనింతేలో రవితేజ ఇండస్ట్రీ నేపథ్యం గురించి సీరియస్ గా చర్చించిన సినిమా చేసి ఇప్పుడు దాన్ని సెటైరిక్ గా చూపించే ఫంకీని వద్దనుకోవడం మంచి నిర్ణయమే. ఫంకీ కూడా రవితేజ చేసి ఉంటే నేనింతేకున్న కల్ట్ ముద్ర కొంత తగ్గిపోయేది. ఆ కోణంలో చూసుకుంటే సరైన పననే చెప్పాలి.

ఒకవేళ ఫంకీ కనక హిట్టయ్యి ఉంటే అనుదీప్ వైపు అగ్ర హీరోలు ఒక లుక్ వేసేవాళ్ళు. కానీ ఇప్పుడా ఛాన్స్ లేదు. కథా బలం కంటే వన్ లైనర్స్ కామెడీ మీద అతిగా ఆధారపడటం ఫైనల్ గా చేటు చేసింది. సినిమా కంటే ఇంటర్వ్యూలు, ప్రోమో ప్రోగ్రాంలు బాగున్నాయంటేనే ఆడియన్స్ కంటెంట్ ని ఎలా రిసీవ్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

అనుదీప్ నెక్స్ట్ ఎవరితో అనేది ఇంకా లాక్ కాలేదు. ప్రిన్స్ తర్వాత ఫంకీకే ఇంత గ్యాప్ తీసుకున్నప్పుడు ఇప్పుడప్పుడే కొత్త అనౌన్స్ మెంట్ రాకపోవచ్చు. రవితేజ ఇరుముడితో బిజీ అయిపోయారు. వేసవిలో రిలీజ్ చేసే ప్లాన్ తో షూటింగ్ జరుగుతోంది.