తెలుగు మిస్ ఇండియా అదరగొట్టిందిగా

ఫీల్ గుడ్ ప్రేమకథలు సక్సెస్ కావాలంటే హీరో హీరోయిన్ల పెర్ఫార్మన్స్ చాలా కీలకం. ఏ ఒక్కరు తేడా చేసినా అవుట్ ఫుట్ మీద ప్రభావం చూపిస్తుంది. గీతాంజలి, ప్రేమ, ఓయ్ లాంటివి క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్నాయంటే దానికి కారణం ఇదే. అందుకే కపుల్ ఫ్రెండ్లి మీద ఈ పాయింట్ పరంగా పెద్ద బరువే ఉంది. సంతోష్ శోభన్ గురించి కొత్తగా చెప్పడానికి లేకపోయినా మానస వారణాసి మీద అవగాహన ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అయితే మూవీ చూశాక ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. అందులోనూ స్వచ్ఛమైన తెలుగమ్మాయి అని తెలిశాక ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతు అవుతోంది. అసలు మ్యాటర్ ఇంకా ఉంది.

మానస వారణాసి పక్కా హైదరాబాది. స్థానిక వాసవి కళాశాలలో ఇంజనీరింగ్ చేసింది. స్కూలింగ్ కొంత భాగం మలేషియాలో జరిగింది. 2020 లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. పిల్లల మీద లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చేపట్టిన వీ క్యాన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంది. స్వతహాగా తను భరతనాట్యం డాన్సర్. ప్రముఖ ఆంగ్ల రచయిత మ్యారీ ఒలివర్ కవితాన్ని బాగా ఇష్టపడుతుంది. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ బోర్డులో సభ్యత్వం తీసుకుని మూగ చెవిటి కళాకారుల కోసం ప్రోగ్రాంస్ చేస్తూ ఉంటుంది. 2024లో దేవకీనందన వాసుదేవలో తెరంగేట్రం చేసింది.

డెబ్యూ డిజాస్టర్ అయినప్పటికీ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న టైంలో కపుల్ ఫ్రెండ్లీ దక్కింది. చాలా హెవీ ఎమోషన్ ఉన్న ఈ పాత్రను అలవోకగా చేసిన తీరు ప్రసంశలు తెస్తోంది. సంతోష్ శోభన్ లాంటి సీనియర్ పెర్ఫార్మర్ ముందు బెరుకు లేకుండా నటించడం మున్ముందు మరిన్ని అవకాశాలు తెచ్చేలా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సీరియస్ లవ్ డ్రామాలో మానస వారణాసి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు, నటన సహజంగా ఉన్నాయి. ఇప్పుడీ బ్రేక్ వల్ల ఆఫర్లు బాగానే వచ్చేలా ఉన్నాయి. కాకపోతే సరైనవి ఎంచుకుని కెరీర్ ని ప్లాన్ చేసుకుంటే సాయిపల్లవి లాగా పెద్ద స్థాయికి వెళ్లొచ్చు. కాకపోతే అలాంటి కథలు పడాలి.