సినిమా ఆడలేదు… ఛాన్స్ తెచ్చిపెట్టింది

తొలి సినిమా ఫ్లాప్ అయినా సరే.. తన అందం, చురుకుదనంతో ప్రేక్షకులనే కాక ఇండస్ట్రీ దృష్టిని కూడా ఆకర్షించే హీరోయిన్లకు తర్వాత బాగానే అవకాశాలు వస్తుంటాయి. భాగ్యశ్రీ బోర్సే ఇలాగే వరుసగా ఛాన్సులు అందుకుంటోంది. ఆమె తొలి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. అయినా ఆ సినిమా ప్రభావం తన కెరీర్ మీద పడలేదు. భాగ్యశ్రీని దర్శకుడు హరీష్ శంకర్ చాలా అందంగా, సెక్సీగా తెరపై ప్రెజెంట్ చేయడంతో కుర్రకారు ఆమె ప్రేమలో పడిపోయారు.

తర్వాత వరుసగా ఆమె కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రాల్లో నటించింది. కానీ వీటిలో ఏదీ విజయవంతం కాలేదు. అయినా భాగ్యశ్రీకి అవకాశాలేమీ ఆగడం లేదు. ప్రస్తుతం అఖిల్ అక్కినేని సరసన ‘లెనిన్’లో నటిస్తున్న ఆమెకు తెలుగులో ఇంకో రెండు చిత్రాల్లో అవకాశాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆమె ఒక క్రేజీ తమిళ ప్రాజెక్టులోనూ ఛాన్స్ పట్టేసినట్లు సమాచారం.

‘కాంత’ తమిళంలో భాగ్యశ్రీకి తొలి సినిమా. ఆ చిత్రం అనుకున్నంతగా ఆడలేదు. ఐతే ఈ చిత్రంలో బ్లాక్ అండ్ వైట్ నాటి కథానాయికగా భాగ్యశ్రీ అభినయం ప్రశంసలు అందుకుంది. తొలిసారిగా ఆమెలోని మంచి నటిని ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రమిది. ఆ పెర్ఫామెన్స్ వల్ల ఇప్పుడు శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరో సరసన సినిమా చేసే అవకాశాన్నందుకుంది భాగ్యశ్రీ.

సంక్రాంతికి ‘పరాశక్తి’ చిత్రంతో షాక్ తిన్నాడు శివకార్తికేయన్.
దీని తర్వాత అతను హీరోగా అనుకున్న వేరే సినిమా ఆగిపోయింది. దాని స్థానంలో శివకుమార్ అని తన సొంత బేనర్లో ‘తాయ్ కిలవి’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్న దర్శకుడితో శివకార్తికేయన్ జట్టు కడుతున్నాడు.

ఈ సినిమాను కూడా శివనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ కథానాయికగా ఎంపికైనట్లు కోలీవుడ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. మంచి పెర్ఫామర్, ఫాలోయింగ్ ఉన్న శివ సరసన సినిమా అంటే భాగ్యశ్రీకి బంపరాఫర్ అన్నట్లే.