ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు విడుదల కావడం అరుదైన విషయం. ఎప్పుడో తొంభైవ దశకంలో నందమూరి బాలకృష్ణ చిత్రాలు ‘బంగారు బుల్లోడు’, ‘నిప్పురవ్వ’ ఇలా రిలీజ్ కాగా.. మళ్లీ చాలా ఏళ్లకు నేచురల్ స్టార్ నాని మూవీస్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై కపిరాజు’ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండుసార్లూ ఒక సినిమా బాగా ఆడింది. ఇంకోటి దెబ్బ తింది.
గత ఏడాది తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ చిత్రాలు డ్యూడ్, ఎల్ఐకే ఇలాగే దీపావళి పోటీకి సై అన్నాయి కానీ.. తర్వాత ‘డ్యూడ్’ మాత్రమే రిలీజైంది. ‘ఎల్ఐకే’ వెనక్కి వెళ్లిపోయింది. కాగా టాలీవుడ్లో మళ్లీ ఒక హీరో సినిమాలు రెండు ఒకే రోజు విడుదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ హీరో శ్రీ విష్ణు కాగా.. క్లాష్‌కు రెడీ అవుతున్న తన సినిమాలు విష్ణు విన్యాసం, మృత్యుంజయ్.
‘విష్ణు విన్యాసం’ను ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతున్నట్లు చాలా ముందే ప్రకటించారు. ఐతే ఇప్పుడు ‘మృత్యుంజయ్’ టీజర్ లాంచ్ చేస్తూ ఆ చిత్రాన్ని కూడా అదే రోజు విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇలా ఒకే రోజు రెండు సినిమాలు మీవి రిలీజవుతున్నాయి కదా.. దీన్ని ఎలా డీల్ చేస్తారు, ప్రమోషన్ సంగతేంటి అని అడిగితే శ్రీ విష్ణు స్పష్టంగా సమాధానం ఇవ్వలేకపోయాడు.
తన పుట్టిన రోజు ఫిబ్రవరి 29 అని.. ఈసారి లీఫ్ సంవత్సరం కాకపోవడంతో 28నే చేసుకుందాం అనుకుంటున్నానని.. ఆ రకంగా ఆ వీకెండ్ తనకు ప్రత్యేకం అని.. రెండు సినిమాల ప్రమోషన్ విషయంలో ఏం చేయాలో తనకూ క్లారిటీ లేదని.. ఎవరి సలహా అయినా తీసుకుంటానని చెప్పాడు.
ఇలా ఒకే రోజు ఒక హీరో సినిమాలు రెండు రిలీజ్ కావడం రెంటికీ అంత మంచిది కాదు. అలాంటపుడు హీరోనే చొరవ తీసుకుని ఒకదాన్ని పక్కకు తప్పించాలి. కానీ శ్రీ విష్ణు మాత్రం తన చేతుల్లో ఏం లేదన్నట్లుగా మాట్లాడాడు.
అతడికి ‘విష్ణు విన్యాసం’ సినిమా మీద ఏమైనా ఆసక్తి లేదా.. ఆ సినిమా ఫిబ్రవరి 27న వస్తుందని తెలిసి కూడా లేటుగా రేసులోకి వచ్చిన ‘మృత్యుంజయ్’ సినిమాకు అదే డేట్ ప్రకటిస్తుంటే ఊరుకున్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి అనుకున్నట్లే ఈ రెండు చిత్రాలూ ఒకే రోజు రిలీజవుతాయా.. లేదా మార్పులేమైనా ఉంటాయా అన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates