ఎవెంజర్స్ దర్శకుడితో ధనుష్


కెరీర్ ఆరంభంలో తమిళ హీరో ధనుష్‌ను చూసిన వాళ్లు ఇతనేం హీరో అన్నారు. అతనక్కడ స్టార్‌గా ఎదగడం చూసి మన వాళ్లు కామెడీ చేశారు కూడా. కానీ అతడి టాలెంట్ ఏంటో ‘రఘువరన్ బీటెక్’ లాంటి సినిమాలతో మన వాళ్లకూ అర్థమైంది. నిజానికి అంతకుముందే ఎన్నో అద్భుతమైన పాత్రలతో, అసాధారణ నటనా విన్యాసాలతో ధనుష్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

‘రాన్‌జానా’తో హిందీ ప్రేక్షకుల్ని సైతం మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్లో చేసిన ‘షమితాబ్’లోనూ అతడి పెర్ఫామెన్స్ అదిరిందన్న ఫీడ్ బ్యాక్ వచ్చింది. కానీ ఆ సినిమా ఆడలేదు. ప్రస్తుతం ‘రాన్‌జానా’ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్‌తో ‘ఆత్రంగి’ అనే సినిమా చేస్తున్నాడు ధనుస్. మధ్యలో హాలీవుడ్ ఓ అంతర్జాతీయ సినిమా కూడా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు.. ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్’. యూరప్ నేపథ్యంలో అక్కడి ఫిలిం మేకరే ఈ సినిమాను రూపొందించాడు. ఐతే ఇది ఆశించిన ఫలితాన్నందుకోలేదు.

ఇప్పుడు ధనుష్ ఓ హాలీవుడ్ ప్రాజెక్టుకు ఎంపిక కావడం విశేషం. ప్రఖ్యాత ఓటీటీ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ అంతర్జాతీయ తారలతో ‘ది గ్రే మ్యాన్’ పేరుతో భారీ హాలీవుడ్ వెబ్ సిరీస్ మొదలుపెడుతోంది. ఇందులో ధనుష్ కూడా నటించబోతున్నాడు. ‘ఎవెంజర్స్’తో పాటు ‘కెప్టెన్ అమెరికా: వింటర్ సోల్జర్’ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రుసో బ్రదర్స్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేయబోతుండటం విశేషం.

ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఎవన్స్లాంటి టాప్ హాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గొప్ప పేరున్న దర్శకులు.. ఆర్టిస్టులతో ధనుష్ పని చేయబోతుండటం మామూలు విషయం కాదు. బాలీవుడ్ నుంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు హాలీవుడ్ సినిమాల్లో భాగమయ్యారు కానీ.. చిన్న సినిమాలతో ప్రస్థానం ఆరంభించి స్వశక్తితో ఎదిగిన ఒక దక్షిణాది నటుడికి అంతర్జాతీయ సినిమాల్లో అవకాశం దక్కడం గొప్ప విషయమే.