ఈ వీకెండ్లో లెక్క పెట్టలేనన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమాలు తక్కువ. ఉన్నంతలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన ‘యుఫోరియా’ కొంత బజ్ తెచ్చుకుంది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. మంచి సందేశాత్మక కథే అయినప్పటికీ.. దాన్ని తెరపై గుణశేఖర్ సరిగా చెప్పలేకపోయాడు.
ప్రేక్షకులు జీర్ణించుకోలేని కొన్ని సన్నివేశాలు.. విపరీతంగా సాగదీసిన కథనం.. బోరింగ్ సెకండాఫ్ సినిమాకు మైనస్ అయ్యాయి. సినిమాకు వీకెండ్లోనే సరిగా వసూళ్లు లేవు. నవీన్ చంద్రతో కరుణ్ కుమార్ తీసిన ‘హనీ’ కాన్సెప్ట్ బాగున్నా.. దాని ఎగ్జిక్యూషన్లోనూ తడబాటు వల్ల సినిమా మిశ్రమానుభూతిని కలిగిస్తోంది. దీనికి ప్రి రిలీజ్ బజ్ లేకపోవడంతో వసూళ్లు అంతంతమాత్రంగా ఉన్నాయి.
‘శ్రీ చిదంబరం’ పర్వాలేదనే టాక్ వస్తోంది. బరాబర్ ప్రేమిస్తా, సుమతీశతకం, బ్లడ్ రోజెస్, పద్మ లాంటి సినిమాల గురించి పెద్దగా డిస్కషనే లేదు.
ఐతే తెలుగు సినిమాలతో పోలిస్తే తమిళ అనువాద చిత్రమైన ‘విత్ లవ్’ బెటర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది ఈ వీకెండ్లో. గత ఏడాది ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో దర్శకుడిగా మెప్పించిన అభిషాన్ జీవింత్ ఇందులో హీరోగా నటించాడు. మలయాళ సెన్సేషన్ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. మదన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని రజినీకాంత్ కూతురు సౌందర్య నిర్మించింది.
ఈ సినిమా యువ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తమిళంలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రానికి.. తెలుగులోనూ స్పందన బాగుంది. పెళ్లి చూపుల్లో భాగంగా కలిసిన ఒక జంట.. తమ వన్ సైడ్ లవ్ స్టోరీల గురించి చెప్పుకుంటాయి. తమ ప్రేమను అవతలి వ్యక్తికి చెప్పలేనందుకు ఫీలై.. ఇప్పుడు ఆ ప్రయత్నం చేద్దాం అనుకుని ఇద్దరూ కలిసి రంగంలోకి దిగుతారు. ఈ నేపథ్యంలో చాలా హుషారుగా, హృద్యంగా సాగే చిత్రాన్ని యూత్ బాగా ఆస్వాదిస్తున్నారు.
ఇక రామ్ చరణ్ ఆరెంజ్ మూడో రీ రిలీజ్ అయినా కూడా ప్రేక్షకుల ఆదరణ పెరిగిందే కానీ అసలు తగ్గలేదు. కొత్త రిలీజుల కంటే దీనికే ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
