నిధి అగర్వాల్… అయిదేళ్ల కష్టం వృథా

నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే  కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే చేసింది. బాలీవుడ్లో ‘మున్నా మైకేల్’ సినిమాతో కథానాయికగా పరిచయం అవ్వగానే.. తెలుగులో ‘సవ్యసాచి’ సినిమా చేసే అవకాశం లభించింది.

తర్వాత వరుసగా మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో.. ఇలా సినిమాలు చేసుకుపోయింది. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ మినహాయిస్తే ఏ సినిమా ఆడలేదు. మధ్యలో రెండు తమిళ చిత్రాలు కూడా నటించిన ఆమెకు.. పెద్ద విజయాలైతే దక్కలేదు. 

అయినా సరే నిధికి అవకాశాలకేమీ లోటు లేకపోయింది. తెలుగులో రెండు భారీ చిత్రాల్లో, అగ్ర కథానాయకుల సరసన నటించే అవకాశం అందుకుంది. అవే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘హరిహర వీరమల్లు’, రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం ‘రాజాసాబ్’. ఈ రెండు చిత్రాలు సుదీర్ఘ కాలం చిత్రీకరణ జరుపుకున్నాయి.

ముఖ్యంగా ‘వీరమల్లు’ మొదలయ్యాక.. రిలీజ్ కావడానికి ఐదేళ్లు పట్టినా ఓపిగ్గా ఎదురు చూసింది నిధి. దీంతో పాటుగా ‘రాజాసాబ్’ కోసం ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇచ్చింది. ఆ సినిమాలు రిలీజైనపుడు ప్రమోషన్ల కోసమూ అంకితభావంతో, చాలా కష్టపడింది. 

కానీ ఆమె కష్టానికి ఫలితం మాత్రం రాలేదు. ఈ రెండు చిత్రాలూ డిజాస్టర్లే అయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు ఇలా అవ్వడంతో నిధికి తీవ్ర నిరాశ తప్పలేదు. ‘రాజాసాబ్’ ప్రమోషన్ల టైంలో తనకు చాలానే అవకాశాలు వస్తున్నాయని.. ఈ సినిమా రిలీజ్ తర్వాత వాటి వివరాలు వెల్లడిస్తానని చెప్పింది నిధి.

కానీ ఈ మూవీ రిలీజై నెల కావస్తున్నా నిధి కొత్త సినిమా కబుర్లేవే బయటికి రాలేదు. కెరీర్లో సక్సెస్ రేట్ మరీ తక్కువగా ఉండడం, పైగా టాప్ స్టార్లతో నటించిన సినిమాలు డిజాస్టర్లు కావడంతో ఇక ఆమెకు పెద్ద ఛాన్సులు రావడం కష్టంగానే కనిపిస్తోంది.కనీసం మిడ్ రేంజ్ చిత్రాల్లో అయినా అవకాశాలు వస్తాయా.. కెరీర్ ముందుకు సాగుతుందా అన్నదే చూడాలి.