సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన ‘విశ్వంభర’ చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం వల్ల రిలీజ్ కూడా లేటవుతోంది. ఐతే ప్రస్తుతం ఖాళీగా ఉన్న చిరు.. బాబీ కొల్లి దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమాకు సన్నద్ధమవుతున్నాడు.
ఈ సినిమాకు స్క్రిప్టు సిద్ధమైంది. ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జన నాయగన్ సెన్సార్ వ్యవహారం వల్ల ఈ మూవీ మొదలవడానికి కొంత ఆలస్యం జరిగింది. అందుకు కారం రెంటి నిర్మాత కేవీఎన్ సంస్థ కావడం. ఇందులో భాగంగా ముఖ్య పాత్రలకు నటీనటుల ఎంపికా జరుగుతోంది.
ఇందులో చిరు నడి వయస్కుడి పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో కథానాయకుడికి వయసుకు ఎదిగిన ఒక కూతురు ఉంటుందట. ఆ పాత్ర కథలో చాలా కీలకమట. ఈ పాత్ర కోసం ‘దురంధర్’ ఫేమ్ సారా అర్జున్‌ను ఎంచుకున్నట్లు తాజా సమాచారం.
ముందు ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి, ఛాంపియన్ భామ అనస్వర పేర్లను ఈ పాత్ర కోసం పరిశీలించారట. కానీ ఇప్పుడు సారానే ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. సారా చిన్నమ్మాయిగా ఉండగా ‘నాన్న’ సినిమాలో విక్రమ్ కూతురి పాత్రలో ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది.
ఆ తర్వాత బాల నటిగా మరి కొన్ని సినిమాల్లో నటించింది. టీనేజీలోకి వచ్చాక ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో యంగ్ ఐశ్వర్యారాయ్ పాత్ర చేసింది.
తర్వాత గ్యాప్ తీసుకుని ‘దురంధర్’ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి సారాకు మంచి పేరు, క్రేజ్ తీసుకొచ్చింది. తెలుగులో ఆమె లీడ్ రోల్ చేసిన ‘యుఫోరియా’ ఈ శుక్రవారమే రిలీజవుతోంది. ఈలోపు సారా.. చిరు సినిమాలో అవకాశం పట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. చూస్తుంటే తెలుగులో ఆమె బాగా బిజీ అయిపోయేలా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates