టాలీవుడ్‌కు ఇంకో రీ‘మేకు’

గతంలో రీమేక్ అంటే మినిమం గ్యారెంటీ అనే భరోసా ఉండేది. వేరే భాషలో పెద్ద హిట్టయిన సినిమాను తీసుకుని రీమేక్ చేస్తే.. చాలా వరకు సినిమాలు ఆడేసేవి. ఠాగూర్, నువ్వు వస్తావని లాంగటి రీమేక్‌ సినిమాలు రికార్డ్ బ్రేకింగ్ హిట్లు అయ్యాయి.

అప్పట్లో ఇతర భాషల్లో వచ్చిన సినిమాలను మన వాళ్లు చూడడం తక్కువ కాబట్టి రీమేక్‌ను స్ట్రెయిట్ సినిమాలాగే చూసేవారు. కథ ముందు లీక్ అయ్యేది కాదు. సరిగ్గా తీస్తే రీమేక్‌లు మంచి ఫలితాలందుకునేవి. కొన్ని ఒరిజినల్‌ను మించి ఆడేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

ఓటీటీ కాలంలో అందరూ అన్ని భాషల సినిమాలనూ చూసేస్తున్నారు. కథ ముందే తెలిసిపోతోంది. హైలైట్లు బయటికి వచ్చేస్తున్నాయి. దీంతో రీమేక్ అనగానే జనం లైట్ తీసుకుంటున్నారు. మాతృకకు మార్పులు చేర్పులు చేసి.. ఎన్ని ఆకర్షణలు జోడించినా వర్కవుట్ కావడం లేదు. 

జాను, శేఖర్, ఇష్క్, బుట్టబొమ్మ, భోళాశంకర్, మిస్టర్ బచ్చన్, బ్రో, భైరవం.. ఇలా గత కొన్నేళ్లలోనే ఎన్నో రీమేక్‌లు బోల్తా కొట్టాయి తెలుగులో. ఒకప్పటితో పోలిస్తే రీమేక్‌లు తగ్గాయి. కానీ ఆగడం లేదు. గత వీకెండ్లో రిలీజైన ‘ఓం శాంతి శాంతి శాంతి:’ కూడా రీమేకే. తెలుగు ప్రేక్షకులు కూడా ఓటీటీలో బాగా చూసిన మలయాళ హిట్ మూవీ ‘జయ జయ జయ జయహే’కు ఇది రీమేక్.

అంత పాపులర్ సినిమాను మళ్లీ తీయడం దేనికంటూ ఎన్నో ప్రశ్నలు ఎదరైనా.. టీం తగ్గలేదు. ఒరిజినల్‌కు చాలా మార్పులు చేశామని, మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దామని.. కచ్చితంగా హిట్ కొడతామని ధీమా వ్యక్తం చేసింది. తీరా చూస్తే.. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు అంతగా థియేటర్లకు రాలేదు.

సినిమాకు బ్యాడ్ టాక్ ఏమీ లేదు కానీ.. అలా అని సూపర్ అనే ఫీడ్ బ్యాక్ కూడా లేదు. ఒరిజినల్ కంటే బెటర్ అని ఎవ్వరూ అనడం లేదు. యావరేజ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ప్రేక్షకులకు సినిమా మీద పెద్దగా ఆసక్తి కనిపించలేదు. వీకెండ్లోనే ‘ఓం శాంతి శాంతి శాంతి:’కి సరైన వసూళ్లు రాలేదు. ఇక వారాంతం అయ్యాక సినిమా నిలబడడం మరింత కష్టమే. మొత్తానికి టాలీవుడ్‌కు రీమేక్ రూపంలో మరో మేకు గుచ్చుకుందన్నది స్పష్టం.