ఉస్తాద్ ముందుకు రావడం మంచిదే

సంక్రాతి సినిమాల సందడి ఒకవైపు కొనసాగుతుండగానే ఇంకోవైపు భవిష్యత్తులో విడుదల కాబోతున్న ప్యాన్ ఇండియా మూవీస్, వాటి రిలీజ్ డేట్ల గురించి వాడివేడి చర్చ జరుగుతోంది. మార్చి 27 పెద్ది వస్తుందని టీమ్ వివిధ రూపాల్లో క్లారిటీ ఇస్తున్నప్పటికీ వాయిదాకు సంబంధించిన పుకార్లు మాత్రం ఆగడం లేదు.

ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ కోసం ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ పనులు మొదలుపెట్టినా ఇంకా బ్యాలన్స్ ఉన్న షూటింగ్, ఐటెం సాంగ్ చిత్రీకరణ, ప్రమోషన్లకు సరిపడా సమయం, దురంధర్ 2 – టాక్సిక్ తో పోటీ లాంటి అంశాలు టార్గెట్ ని ప్రభావితం చేస్తాయేమోననే టెన్షన్ మెగాభిమానులను విపరీతంగా నలిపేస్తోంది.

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ది కనక తప్పుకునే పక్షంలో అదే డేట్ కి ఉస్తాద్ భగత్ సింగ్ తీసుకొచ్చే ఆలోచనలో మైత్రి సంస్థ ఉన్నట్టు గతంలోనే ప్రచారం జరిగింది. ఎలాగూ పెద్దికి మైత్రి పార్ట్ నర్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పటికైతే ప్రకటన ఇవ్వలేదు కనక ఖరారుగా చెప్పలేం.

కానీ నిజమయ్యే పక్షంలో ఉస్తాద్ ముందుకు రావడం మంచిదే అవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు లేవు. ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమా, సో ఆటోమేటిక్ గా అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఏ మాత్రం బాగున్నా రికార్డుల ఊచకోత ఖాయం.

అప్పుడు పెద్ది మేకి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇదంతా ప్రతిపాదన దశలోనే ఉంది కనక ఎలాంటి అనౌన్స్ మెంట్స్ రావడం లేదు. దర్శకుడు బుచ్చిబాబు మాత్రం రామ్ చరణ్ పుట్టినరోజుకి పెద్ది రిలీజ్ కానుకగా ఇవ్వాలని కంకణం కట్టుకున్నాడు. కానీ పరిస్థితులు తనకు పూర్తియా సహకరించకపోతేనే చిక్కు వస్తుంది.

అసలే తెలంగాణ హైకోర్టు టికెట్ రేట్ల విషయంలో పెట్టిన తొంభై రోజుల కండీషన్ పెద్దిని ఇరకాటంలో పెట్టింది. ఆ గడువు ప్రకారమైతే పెద్దికి టికెట్ హైక్స్ రావు. అదే జరిగితే నైజాం రెవిన్యూలో పెద్ద కోత పడుతుంది. ఇది పక్కనపెడితే వీలైనంత త్వరగా పెద్ది టీమ్ క్లారిటీ ఇస్తే ఉస్తాద్ ముస్తాబవ్వాలా వద్దా అనేది డిసైడవుతుంది.