పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం మొదలైన తీరు.. బరిలో నిలిచిన తొలి ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు చూశాక.. ఆయన మీద పెద్ద ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనే ముద్ర పడిపోయింది. ఆ స్థితి నుంచి పవన్ ఏమాత్రం పుంజుకుంటాడో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ రెండో ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి సీటులోనూ తన పార్టీని విజేతగా నిలిపి సంచలనం సృష్టించారు పవన్.
ఆయన ఏపీకి ఉప ముఖ్యమంత్రి అవుతాడని, నాలుగు మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపడతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి కాగలడనే అంచనాలు కూడా పవన్ మీద ఉన్నాయి. ఐతే పవన్‌తో కలిసి ‘హరిహర వీరమల్లు’ సినిమా చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం పవన్ ఏకంగా ప్రధాని కాగలడని, అలా అయితే తానేమీ ఆశ్చర్యపోనని అంటోంది.
‘హరిహర వీరమల్లు’కు పని చేసే క్రమంలో పవన్ రాజకీయ ప్రయాణాన్ని కూడా దగ్గరగా చూసింది నిధి. ఈ నేపథ్యంలో ఒక పాడ్ కాస్ట్‌లో ఇంటర్వ్యూయర్ పవన్ ప్రధాని కాగలడని నా నమ్మకం, మరి మీరేమంటారు అని అడిగితే.. ‘‘ఆయన చాలా ధైర్యవంతుడు. సింహం లాంటివాడు. ఏ సందర్భంలోనైనా ఒక్కడే నిలబడగలడు. ఎవరికీ లేని ధైర్యం ఆయనలో ఉంది.
పవన్ ప్రధాని అయితే నేను ఆశ్చర్యపోను. నిజంగా ఆశ్చర్యపోను. ఎందుకంటే ఆయన రాజకీయాల మీద చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు పేరు వచ్చి అందరూ తన గురించి చర్చించుకుంటున్నారు కానీ.. ఆయన దీని కోసం చాలా ఏళ్ల ముందు నుంచే కష్టపడుతున్నారు. ఆయనొక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. తన టీం పనితీరు గొప్పగా ఉంటుంది. ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. పార్టీని గొప్పగా నిర్మించుకున్నారు. పవన్‌లో అసాధారణ తెగువ ఉంది. ప్రతిసారీ మంచి కోసమే నిలబడతారు’’ అంటూ జనసేనానిని కొనియాడింది నిధి.
Gulte Telugu Telugu Political and Movie News Updates