టీజ‌రైనా రాక‌ముందే ప‌వ‌న్ సంచ‌ల‌నం


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండేళ్ల‌కు పైగా సినిమాల‌కు దూరంగా ఉన్నాడు. మ‌ళ్లీ సినిమాలు చేయాల‌నుకున్నాక ఎంచుకున్న‌ది సామాజిక అంశాల‌తో కూడిన‌, మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల మీద చ‌ర్చించే సినిమాను. దీని ప‌ట్ల ఆరంభంలో అభిమానుల నుంచి నిరాస‌క్త‌త వ్య‌క్త‌మైంది. ఐతేనేం.. సినిమా ప‌ట్టాలెక్కాక‌, ఫ‌స్ట్ లుక్ వ‌దిలాక నెగెటివిటీ అంతా ప‌క్క‌కు వెళ్లిపోయింది.

వ‌కీల్ సాబ్ అనే టైటిల్, స్టైలిష్ ఫ‌స్ట్ లుక్ మొత్తం క‌థ మార్చేశాయి. వ‌కీల్ సాబ్ సోష‌ల్ మీడియాను ఏల‌డం మొద‌లుపెట్టాడు. ఇప్ప‌టిదాకా ఈ సినిమా నుంచి టీజ‌ర్ కూడా రిలీజ్ కాలేదు. ఐతేనేం ట్విట్ట‌ర్లో ఈ ఏడాది అత్య‌ధికంగా ట్రెండ్ అయిన తెలుగు మూవీ హ్యాష్ ట్యాగ్ ఇదే కావ‌డం విశేషం. మొత్తంగా సౌత్ ఇండియా లెవెల్లో వ‌కీల్ సాబ్ హ్యాష్ ట్యాగ్ రెండో స్థానంలో నిలిచింది.

త‌మిళ స్టార్ విజ‌య్ మూవీ మాస్ట‌ర్ అగ్ర స్థానాన్ని ద‌క్కించుకుంది. ఐతే ఆ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధమైంది. టీజ‌ర్ కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ గురించి ఎంతో చ‌ర్చ న‌డిచింది. కానీ వ‌కీల్ సాబ్ సినిమా ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్ మాత్ర‌మే వ‌దిలారు. టీజ‌ర్ కూడా రాలేదు. అయినా స‌రే.. దాని హ్యాష్ ట్యాగ్ సౌత్ ఇండియాలో రెండో స్థానంలో, తెలుగు వ‌ర‌కు అల వైకుంఠపుర‌ములో, స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి సినిమాల్ని వెన‌క్కి నెట్టి అగ్ర స్థానంలో నిల‌వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.

ఇదిలా ఉండ‌గా.. వ‌కీల్ సాబ్ ట్విట్ట‌ర్ ఘ‌న‌త‌ను నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ఓ కొత్త పోస్ట‌ర్ వ‌దిలింది. ఇంత‌కుముందు లీక్ అయి సంచ‌ల‌నం రేపిన ప‌వ‌న్ ఫొటో ఒరిజిన‌ల్‌ను ఇప్పుడు రిలీజ్ చేయ‌డం విశేషం. అది వెంట‌నే ట్విట్ట‌ర్లో వైర‌ల్ అయిపోయింది.