సంక్రాంతి పండుగ తెలుగు వారికే కాదు.. తమిళులకూ చాలా స్పెషల్. అక్కడ కూడా పది రోజుల పాటు సెలవులుంటాయి. దీంతో ఈ సీజన్లో భారీ చిత్రాలు బాక్సాఫీస్ రేసులో నిలుస్తుంటాయి. ఈసారి విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ సంక్రాంతి బరిలో నిలవడంతో బాక్సాఫీస్ మోత మోగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ చిత్రం అనూహ్యంగా రేసు నుంచి తప్పుకోవడంతో కోలీవుడ్ పొంగల్ బాక్సాఫీస్ వెలవెలబోయింది.
శివ కార్తికేయన్ సినిమా ‘పరాశక్తి’ అనుకున్న ప్రకారమే రిలీజైనా.. కొత్తగా కార్తి మూవీ ‘వా వాత్తియార్’, జీవా చిత్రం ‘తలైవర్ తంబి తలైమయిల్’ రేసులోకి వచ్చినా.. థియేటర్లలో సందడి కరవైంది. ‘పరాశక్తి’ ముందు నుంచి మంచి అంచనాలుండగా.. సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
ఇక ‘వా వాత్తియార్’, ‘తలైవర్ తంబి తలైమయిల్’ పాజిటివ్ టాకే తెచ్చుకున్నప్పటికీ.. వీటికి ప్రి రిలీజ్ బజ్ లేకపోవడం మైనస్ అయింది. వసూళ్లు ఓ మోస్తరుగా వస్తున్నాయంతే. ఇంకేవో ఒకట్రెండు చిన్న సినిమాలు రిలీజైనా అవి పెద్దగా ప్రభావం చూపలేదు. మొత్తంగా సంక్రాంతి సినిమాలన్నింటికీ కలిపితే తమిళనాడు వసూళ్లు వంద కోట్లకు మించట్లేదు. ఒకవేళ విజయ్ సినిమా బరిలో ఉండుంటే మాత్రం కోలీవుడ్లో వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నమోదై ఉండేవి. ఆ చిత్రం వరల్డ్ వైడ్ అలవోకగా రూ.500 కోట్ల వసూళ్ల మార్కును అందుకునేదాని అంచనా.
తమిళనాడులో కూడా కలెక్షన్లు భారీగా ఉండేవి. కానీ ఆ సినిమా పోటీ నుంచి తప్పుకోవడంతో తమిళ బాక్సాఫీస్ వెలవెలబోయింది. మరోవైపు టాలీవుడ్లో మాత్రం సంక్రాంతికి బాక్సాఫీస్ మోతెక్కిపోయింది. ఇక్కడ చిరు సినిమా ‘మన శంకర వరప్రసాద్’ ఒక్కటే రూ.300 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది ఇప్పటిదాకా.
ప్రభాస్ మూవీ ‘రాజాసాబ్’ నెగెటివ్ టాక్‌తోనూ వరల్డ్ వైడ్ రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. నవీన్ పొలిశెట్టి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ కూడా వంద కోట్ల క్లబ్బులో చేరింది. నారీ నారీ నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలకు కూడా మంచి వసూళ్లే వచ్చాయి. మొత్తంగా సంక్రాంతి సినిమాలకు రూ.700 కోట్ల మార్కును దాటబోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
