త్రివిక్రమ్ చుట్టూ ప్రచారాల ముప్పు

ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం చేస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత తీయబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద ఆన్ లైన్ లో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ముందు అల్లు అర్జున్ తో అనుకున్నది తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి లాకైన సంగతి తెలిసిందే.

అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ పలు సందర్భాల్లో నాగవంశీ అన్న మాటలు, పెట్టిన ట్వీట్లు ఇదే అర్థం వచ్చేలా చేశాయి. తాజాగా రామ్ చరణ్ పేరు తెరమీదకు వస్తోంది. గాడ్ అఫ్ వార్ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు ఎవరి చేతికి వెళ్తుందనే దాని మీద అభిమానులు, ఇది మాదే మాదే అంటూ రకరకాల చర్చలు పెట్టేసుకుంటున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఇది తారక్ దగ్గర ఉన్న మాట వాస్తవం. ప్రశాంత్ నీల్ సినిమా అయ్యాక దేవర 2 చేసినా చేయకపోయినా త్రివిక్రమ్ కు డేట్లు ఇవ్వాలని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడట. అలాంటప్పుడు హీరో ఎందుకు మారతాడనే డౌట్ రావడం సహజం.

అందులోనూ చరణ్ కూడా బిజీ ఉన్నాడు. పెద్ది కాగానే సుకుమార్ ఆర్సి 17 స్టార్ట్ అవుతుంది. ఎంతలేదన్నా దానికో ఏడాదిన్నర సమయం పడుతుంది. అప్పటిదాకా త్రివిక్రమ్ ఖాళీగా ఉండరుగా. సో ఏ కోణంలో చూసుకున్నా అరవింద సమేత వీరరాఘవ కాంబినేషన్ రిపీట్ కావడం దాదాపు ఖాయమే. కాకపోతే అఫీషియల్ గా చెప్పే దాకా ముద్ర వేయలేం.

అప్పటిదాకా త్రివిక్రమ్ చుట్టూ ఈ ప్రచారాలు తిరుగుతూనే ఉంటాయి. గుంటూరు కారం వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటిదాకా సినిమా ఇవ్వని మాటల మాంత్రికుడు ఆదర్శ కుటుంబంని వేగంగా పూర్తి చేసి వేసవి కానుకగా రెడీ చేస్తున్నారు. స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటంతో పాటు విఎఫ్ఎక్స్ అవసరం లేని కంటెంట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం అవసరం ఉండదు.

తర్వాత గాడ్ అఫ్ వార్ పనులు మొదలుపెట్టాలి. ఇదంతా తేలడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. అనగనగా ఒక రాజు ఈవెంట్ లో నాగవంశీ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తా రెడీగా ఉండండి అన్నారు. బహుశా అది దీని అనౌన్స్ మెంట్ గురించే కావొచ్చు.