చిరు సినిమా చూసి విడాకులు క్యాన్సిల్

సినిమాల ప్రభావం సమాజం మీద ఉండదు అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా తెలుగువారి జీవితాల్లో సినిమా అనేది ఒక అంతర్భాగంగా మారిపోయిన నేపథ్యంలో.. దాని ప్రభావం మెజార్టీ జనం మీద మంచి, చెడు రెండు రకాలుగా ఉందనే విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకుల మీద చూపిస్తున్న సానుకూల ప్రభావం గురించి ఈ చిత్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

విడాకులు తీసుకుందాం అనుకుంటున్న ఒక జంట మన శంకర వరప్రసాద్ గారు మూవీ చూసి ఆ ఆలోచనను విరమించుకుందట. ఈ విషయం తన దృష్టికి రావడంతో చాలా సంతోషించినట్లు చిరు చెప్పారు.

మూడు నెలల ముందు విడాకులు తీసుకుందాం అనుకుని విడిగా ఉంటున్న భార్యాభర్తలు వేర్వేరుగా మన శంకర ప్రసాద్ గారు సినిమా చూశారని.. అందులో కొన్ని సన్నివేశాలు చూశాక ఆలోచనలో పడి.. మళ్ళీ కలిసి మాట్లాడుకున్నారని.. తర్వాత కలిసి బతకాలని, విడాకులు వద్దని నిర్ణయించుకున్నారని చిరు తెలిపాడు.

ముఖ్యంగా ఇందులో హీరో తల్లి ఒక సన్నివేశంలో భార్యా భర్తల మధ్య ఏ సమస్య వచ్చినా వాళ్లే పరిష్కరించుకోవాలి, మూడో వ్యక్తి జోక్యం ఉండకూడదు అంటూ చెప్పే డైలాగులు వారిలో మార్పు తెచ్చాయని చిరు వెల్లడించాడు. ఈ సన్నివేశం రాసిన దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్ అని చిరు అన్నారు. చిన్న గొడవ, అపార్థాల వల్ల తన నుంచి విడిపోయిన భార్యను.. తనకు దూరమైన పిల్లలను తిరిగి కలవడానికి ఒక భర్త చేసే ప్రయత్నం నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా సాగుతుంది.

సందేశాన్ని వినోదంతో మేళవించి ఆద్యంతం సరదాగా సినిమాను నడిపించాడు రైటర్ కమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. చిరు సరసన నయనతార నటించిన ఈ చిత్ర వసూళ్లు ఇప్పటికే రెండొందల కోట్లకు చేరువగా ఉన్నాయి.