లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో ఉన్న విలన్లను బాంబు ద్వారా పేల్చే సీన్ గురించి వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ డీసెంట్ గా చెప్పాము కానీ ఆ సన్నివేశంలో ఎంత ఇంటెన్సిటీ ఉందో ప్రేక్షకులు గుర్తించేశారు.

అయితే హీరోయిజంని ఎలివేట్ చేయడానికి ఇలాంటి ఎపిసోడ్ డిజైన్ చేసుకుంటారానే కామెంట్స్ ఉన్నప్పటికీ ఒక లేడీ డైరెక్టర్ గా ఇంత డేరింగ్ స్టెప్ వేయడం సందీప్ రెడ్డి వంగా లాంటి క్రియేటర్స్ ప్రశంసలు అందుకుంటోంది. అడల్ట్స్ స్టోరీ అన్నారు కాబట్టి పిల్లలకు రికమండ్ చేసే ఛాన్స్ లేనట్టే.

గతంలో టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా చెప్పుకోదగ్గ మహిళా దర్శకులు ఉన్నారు కానీ బలమైన ముద్ర వేసిన వాళ్ళు తక్కువ. మనవైపు గిన్నిస్ రికార్డ్ హోల్డర్ విజయనిర్మల గారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవచ్చు. ఆవిడ ఇచ్చిన ఎన్నో సూపర్ హిట్ క్లాసిక్స్ గురించి ఇప్పటికీ సినీ ప్రియులు గుర్తు చేసుకుంటూ ఉంటారు.

సమంతతో మా ఇంటి బంగారం తీస్తున్న నందిని రెడ్డి ఖాతాలో అలా మొదలయ్యింది, ఓ బేబీ లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. తెలుసు కదాతో డైరెక్టర్ గా మారిన నీరజ కోన జెన్ జీ బ్యాచ్ కి ఏదో కొత్త కాన్సెప్ట్ చెప్పాలని చూశారు కానీ జనాలకు కనెక్ట్ కాక ఆశించిన ఫలితం దక్కలేదు.

వీళ్ళందరూ మేకింగ్ పరిమితులను పాటిస్తూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసినవాళ్లు. కానీ గీతూ మోహన్ దాస్ ఆ హద్దులు చెరిపేసినట్టే. 2009లో తొలి మలయాళం షార్ట్ ఫిలిం ‘కెల్కున్నుందో’తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఈవిడ ఆ తర్వాత లయర్స్ డైస్, మూథోన్ తో ప్రశంసలు, అవార్డులు తెచ్చుకున్నారు.

ఇదంతా ఏడు సంవత్సరాల వెనుక కథ. అప్పటి నుంచి టాక్సిక్ మీద వర్క్ చేస్తున్న గీతూ మోహన్ దాస్ కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న యష్ ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. అయినా టీజరే ఇంత వయొలెంట్ గా ఉందంటే ఇక అసలు బొమ్మ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే.