పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎంతో ఎగ్జైట్ అవుతుంది. స్టార్ హీరోయిన్లు అయినా ఆ అవకాశాన్ని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇక అప్‌కమింగ్ హీరోయిన్లయితే ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ అఖిల్ మూవీ ‘ఏజెంట్’తో కథానాయికగా పరిచయం అయిన సాక్షి వైద్య.. పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మొదట శ్రీలీలకు తోడుగా సాక్షి వైద్యను ఓ కథానాయికగా ఎంచుకున్నారు. అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. కానీ చివరికి చూస్తే ఆ పాత్రలోకి రాశి ఖన్నా వచ్చింది. తాను ఏ పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందో సాక్షి వైద్య ఒక ఇంటర్వ్యూలో వివరించింది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ పక్కన నటించే అవకాశం వచ్చినపుడు తాను అమితానందానికి గురైనట్లు సాక్షి చెప్పింది. ఆ సినిమా కోసం తాను వారం రోజులు చిత్రీకరణలో కూడా పాల్గొన్నట్లు ఆమె తెలిపింది.
ఐతే మధ్యలో తన కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా తాను వేరే ఊరు వెళ్లాల్సి వచ్చిందని.. అదే సమయంలో ఆ చిత్ర యూనిట్ నుంచి ఫోన్ చేసి రేపటి నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారని.. తిరిగి వెళ్లలేని పరిస్థితుల్లో, డేట్లు సర్దుబాటుచేయలేక ఆ సినిమా వదులుకున్నానని సాక్షి తెలిపింది.పవన్‌తో సినిమా చేయడం తన కల అని.. మళ్లీ ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం చూస్తున్నట్లు ఆమె చెప్పింది.
2023లో సెట్స్ మీదికి వెళ్లిన కొన్ని రోజులకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ ఆగింది. పవన్ 2024 ఎన్నికల కోసమని ఈ మూవీతో పాటు మరో రెండు చిత్రాలను కూడా మధ్యలో ఆపేశాడు. మళ్లీ ఆయన గత ఏడాది అందుబాటులోకి వచ్చాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రీకరణ గత ఏడాది జూన్లో పున:ప్రారంభం అయింది.
కొన్ని నెలల్లోనే హరీష్ చిత్రీకరణ అంతా పూర్తి చేశాడు. ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ‘ఏజెంట్’ తర్వాత తెలుగులో సాక్షి కొత్త సినిమా ‘నారి నారి నడుమ మురారి’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates