జక్కన్నపై ఇంత ప్రేమేంటి డార్లింగ్

ప్ర‌భాస్‌కు చాలామంది ద‌ర్శ‌కులు హిట్లు, బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇచ్చారు. కానీ బాహుబ‌లి లాంటి ఆల్ టైం పాన్ ఇండియా బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో త‌న‌ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఘ‌న‌త రాజ‌మౌళికే ద‌క్కుతుంది. ఆ సినిమాతో ఇండియాలోనే నంబ‌ర్ వ‌న్ స్టార్‌గా అవ‌త‌రించాడు ప్ర‌భాస్. త‌న సినిమాల బ‌డ్జెట్లు, బిజినెస్‌, వ‌సూళ్ల లెక్క‌లే వేరుగా ఉంటాయి. బాలీవుడ్ సూప‌ర్ స్టార్లు కూడా అత‌ణ్ని అందుకోలేని ప‌రిస్థితి.

ఇంత‌గా త‌న కెరీర్‌ను మార్చిన రాజ‌మౌళి మీద ప్ర‌భాస్‌కు ఎంత ప్రేమ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాలా? అవ‌కాశం వ‌చ్చిన‌పుడ‌ల్లా ఆ ప్రేమ‌ను చూపిస్తూనే ఉంటాడు రెబ‌ల్ స్టార్. తాజాగా అందుకో సంద‌ర్భం వ‌చ్చింది. శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా న‌టించిన ఛాంపియ‌న్ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానున్న నేప‌థ్యంలో టీం.. సినీ ప్ర‌ముఖుల‌ను ఇన్వాల్వ్ చేస్తూ వినూత్న‌మైన ప్ర‌మోష‌న్లు చేస్తోంది.

ఒక సెల‌బ్రెటీ ఛాంపియ‌న్ ట్రైల‌ర్ గురించి త‌న అభిప్రాయం చెప్ప‌డం.. దాంతో పాటు త‌న జీవితంలో అస‌లైన ఛాంపియ‌న్ ఎవ‌రో వెల్ల‌డించ‌డం.. త‌ర్వాత మ‌రొక సెల‌బ్రెటీని ట్యాగ్ చేసి మీ జీవితంలో ఛాంపియ‌న్ ఎవ‌రో చెప్పాల‌ని కోర‌డం.. ఇలా సాగుతోంది థ్రెడ్. దుల్క‌ర్ స‌ల్మాన్, నాని, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ‌.. ఇలా ఒక్కొక్క‌రుగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు.

చివ‌ర‌గా సందీప్ వంగ త‌న జీవితంలో ఛాంపియ‌న్ త‌న త‌ల్లే అని వెల్ల‌డిస్తూ.. ప్ర‌భాస్‌ను ట్యాగ్ చేశాడు. ప్ర‌భాస్ ఈ పోస్టుకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించాడు. త‌న జీవితంలో రాజ‌మౌళే ఛాంపియ‌న్ అంటూ త‌న జీవితాన్ని మార్చిన ద‌ర్శ‌కుడిని కొనియాడాడు.

దాంతో పాటుగా ఛాంపియ‌న్ ట్రైల‌ర్‌ను కొనియాడుతూ.. రోష‌న్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఈ సినిమా వెనుక ఉన్న టీం అంతా త‌న‌కు తెలుస‌ని.. ఈ నెల 25న థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూడాల‌ని అభిమానుల‌కు పిలుపునిచ్చాడు ప్ర‌భాస్. ఈ ప్ర‌మోష‌న‌ల్ థ్రెడ్‌లో చాలామంది త‌మ కుటుంబ స‌భ్యులనే ఛాంపియ‌న్లుగా అభివ‌ర్ణించ‌గా.. ప్ర‌భాస్ మాత్రం రాజ‌మౌళి పేరు ప్ర‌స్తావించి ఆయ‌న‌పై త‌నకున్న అపార‌మైన ప్రేమ‌ను చాటుకున్నాడు.