ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులకు ఎంత ప్రాధాన్యం ఉండేదో తెలిసిందే. సినీ జనాలు ఈ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు. ఏటా క్రమం తప్పకుండా ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించేది. ఆ అవార్డుల గురించి అందరూ గొప్పగా మాట్లాడుకునేవారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలు అయ్యాక కథ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఈ అవార్డులను పక్కన పెట్టేసింది. ఏపీలో కొన్నేళ్లు అవార్డులు ఇచ్చినా వాటికి అంత ప్రాధాన్యం దక్కలేదు.
తర్వాత అవార్డులు ఇవ్వడమే మానేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ అవార్డులను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఐతే ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గద్దర్ అవార్డులను తీసుకొచ్చింది. పురస్కారాలను ప్రకటించి వేడుక కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా నంది అవార్డులకు తిరిగి ప్రాణం పోయడానికి ప్రయత్నాలు మొదలైనట్లున్నాయి. తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నంది అవార్డుల గురించి కీలక ప్రకటన చేశారు.
వచ్చే ఉగాదికి నంది అవార్డుల వేడుక నిర్వహించనున్నట్లు కందుల దుర్గేష్ వెల్లడించారు. దీంతో పాటుగా నంది నాటకోత్సవాలు కూడా జరుగుతాయని ఆయన చెప్పారు. ఉగాదికి నంది అవార్డులు ఇవ్వాలంటే.. ఇప్పటి నుంచే అవార్డుల ఎంపిక కోసం పని మొదలుపెట్టాలి. ఇందుకోసం జ్యూరీని ఏర్పాటు చేయాలి. త్వరలోనే కమిటీ గురించి ప్రకటన రావచ్చని భావిస్తున్నారు.
మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించడానికి ఏపీ ప్రభుత్వం త్వరలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా సినిమా టికెట్ ధరలు, ఏపీలో షూటింగ్ చేసే సినిమాలు, హై బడ్జెట్ చిత్రాల టికెట్ రేట్లపై చర్చించనున్నారట.
ముందుగా ప్రభుత్వ అధికారుల సమావేశం జరుగుతుంది. తర్వాత సినీ ప్రముఖులతో ప్రత్యేక భేటీ ఉంటుందట. త్వరలోనే ఈ సమావేశాలకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని, ఏపీలో షూటింగ్ చేసే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని కందుల దుర్గేష్ ఈ సందర్భంగా తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates