శివాజీ జంటని ప్రేక్షకులు అంగీకరిస్తారా

ఒకప్పుడు హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన నటుడు శివాజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి చాలా సంవత్సరాలయ్యింది. చిరంజీవి ఇంద్ర, వెంకటేష్ తులసి నుంచే తన ప్రస్థానం మార్చుకున్నాడు. అలాని రెగ్యులర్ గా తెరమీద కనిపించలేదు కానీ కొంచెం గ్యాప్ తీసుకుని రాజకీయ, ఇతరత్రా కారణాల వల్ల స్క్రీన్ కు దూరంగా ఉన్న మాట వాస్తవం. గత ఏడాది కోర్ట్ రూపంలో కొత్త ఇన్నింగ్స్ ఆడే అవకాశం దొరికింది.

తర్వాత దండోరా లాంటివి నటన పరంగా తనను మరింత పైకి తీసుకెళ్లాయి. ఆ టైంలో పబ్లిక్ స్టేజి మీద మాట్లాడిన కొన్ని మాటలు వివాదాలు తెచ్చినప్పటికీ ఫైనల్ గా జనం దృష్టిలో శివాజీ బాగానే హైలైట్ అయ్యారు. అసలు టాస్క్ ఇప్పుడొచ్చింది. శుక్రవారం విడుదల కాబోతున్న ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’లో శివాజీ, లయ జంటగా నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ మరో ముఖ్యమైన పాత్ర చేశాడు. వీళ్ళ ముగ్గురి మీదే సినిమా రన్ అవుతుంది.

అయితే వీళ్ళకు ఆడియన్స్ ని థియేటర్ కు రప్పించే కెపాసిటీ ఉందా అంటే ఠక్కున ఔననీ చెప్పలేం. ఎందుకంటే వీళ్లకు టికెట్లు కొనేంతగా ప్రత్యేకంగా అభిమానులంటూ లేరు. కంటెంట్ చాలా బాగుందంటే ఆటోమేటిక్ గా జనం రావాలి తప్పించి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం శివాజీ, లయ జంటగా నటించారు కాబట్టి ఇప్పుడు నోస్టాల్జిక్ ఫీలింగ్ కోసం చూద్దామని అనుకోరు. ఒకవేళ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని కనక ఆడియన్స్ ని మెప్పించగలిగితే  శివాజీ మీద థియేటర్ బిజినెస్ జరుగుతుందనే నమ్మకం బయ్యర్లలో వస్తుంది.

అసలే ఇది ఓటిటికి అనుకుని తర్వాత హఠాత్తుగా నిర్ణయం మార్చుకుని బిగ్ స్క్రీన్ కు వచ్చిన మూవీ. అలాంటప్పుడు నిర్మాతల అంచనా తప్పు కాదని నిరూపణ కావాలంటే సినిమా ఎక్స్ ట్రాడినరి అనిపించుకోవాల్సిందే. పోటీ కొంచెం గట్టిగానే ఉంది. మృత్యుంజయ్, సరస్వతి, మెన్షన్ హౌస్ రూపంలో కాంపిటీషన్ స్వాగతం పలుకుతోంది. వెరైటీ ఆఫర్లతో జనాన్ని టికెట్లు కొనిపించేలా చేయడానికి టీమ్ అన్నిరకాలుగా కష్టపడుతోంది. మరి శివాజీ లయ జంట స్టామినా ఏంటో ఎల్లుండి బయటపడనుంది.