శర్వానంద్ చాలా గ్యాప్ తర్వాత ఫుల్ ఫన్ రోల్ తో వస్తున్నాడు. జనవరి 14 సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న నారి నారి నడుమ మురారి టీజర్ ఇవాళ వచ్చేసింది. కథేంటో దాచకుండా చెప్పేశారు. ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసే యవకుడి (శర్వానంద్)కి అదే ఆఫీస్ లో కొలీగ్ అయిన అమ్మాయి(సాక్షి వైద్య) తో పరిచయం, ప్రేమ ఏకంగా పెళ్లి ఫిక్సయ్యేదాకా తీసుకెళ్తుంది. ఈ లోగా ఇతగాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ (సంయుక్త మీనన్) అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఇద్దరి మధ్య శాండ్ విచ్ కావడం మొదలవుతుంది. ఇంతకీ ఇద్దరు నారిల మధ్య నలిగిపోయిన ఈ ప్రేమపక్షి చివరికి ఏం చేసిందనేది తెరమీద చూడాలి.
కాన్సెప్ట్ పరంగా కొత్తదనం లేదు కానీ దర్శకుడు రామ్ అబ్బరాజు ట్రీట్ మెంట్ ప్రధానంగా నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్న వైనం స్పష్టం. సామజవరగమన తరహాలో ఆద్యంతం వినోదమే ప్రధానంగా సాగేలా రాసుకున్నారు. సునీల్, సుదర్శన్, నరేష్ తదితరులతో డైలాగ్ కామెడీ బాగానే పేలేలా ఉంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించేలా ఇందులో స్కోప్ దక్కలేదు కానీ పాటలు పూర్తిగా బయటికి వచ్చాక ఒక అంచనాకు రావొచ్చు. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ మధ్య చితికిపోయే ఫన్నీ రోల్ లో శర్వానంద్ బాగున్నాడు. బైకర్ కన్నా ముందు చేసిన మూవీ కావడంతో వింటేజ్ లుక్ లో కనిపించాడు.
సంక్రాంతి బరిలో అందరికన్నా చివరికి వస్తున్నాడు నారి నారి నడుమ మురారి. జన నాయకుడు, పరశక్తి, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు తర్వాత చివర్లో బరిలో దిగుతోంది. ఇంత కాంపిటీషన్ ఉన్నా దర్శక నిర్మాతలు ధీమాగా ఉన్నారు. అసలే పొంగల్ శర్వానంద్ కు కలిసి వచ్చిన పండగ. ఇంతే పోటీతో గతంలో ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతితో సూపర్ హిట్లు కొట్టాడు. మళ్ళీ అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాకతాళీయంగా రవితేజ కూడా శర్వానంద్ లాగే ఇద్దరు భామల మధ్య నలిగే బాధితుడి పాత్ర చేస్తుండటం విశేషం. లక్కు ఎవరిని వరిస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates